: అనవసర ఏడుపులు ఏడుస్తున్న భారత బ్యాంకులు... విశ్వసనీయత తగ్గుతోంది: రాజన్
అవసరం లేకపోయినా సహాయం కావాలంటూ అనవసర ఏడుపులు ఏడవడం వల్ల భారతీయ బ్యాంకులపై విశ్వసనీయత తగ్గుతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురాం రాజన్ వ్యాఖ్యానించారు. త్వరలో పదవీ విరమణ చేయనున్న ఆయన, ఇండియాలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పెద్దఎత్తున పుట్టుకు వస్తుండటం శుభపరిణామమని, వాటి వల్ల ఉద్యోగ సృష్టి పెరుగుతోందని అన్నారు. కేంబ్రిడ్జ్ వర్శిటీలో 'వై బ్యాంక్స్' అంశంపై ఆయన ప్రసంగించారు. గతంలో ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్ గా కూడా విధులు నిర్వహించిన రాజన్, తమ వద్ద మూలధనం నిల్వలను కరిగించుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత బ్యాంకులపైనే ఉన్నదని, ఆర్థికమాంద్యం నుంచి పూర్తి స్థాయిలో గట్టెక్కాలంటే తప్పనిసరని అన్నారు. రుణాల మంజూరులో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటే ఎటువంటి ఎగవేతలూ ఉండవని అభిప్రాయపడ్డ ఆయన, రుణ మంజూరులో ఉన్న రిస్క్ ను బ్యాంకులు గణనీయంగా తగ్గించుకోవాల్సి వుందన్నారు. ఇండియాలో క్రెడిట్ రేటింగ్ తక్కువగా ఉన్న (బీఏఏ - అధిక రిస్క్) కారణంగానే విదేశీ బ్యాంకులు కొత్త శాఖలను ప్రారంభించేందుకు నిరాసక్తంగా ఉన్నాయని అన్నారు. అంటే, ఇండియాలో డబ్బు తెచ్చి పెడితే, అది తమకు లాభించదని ఇంటర్నేషనల్ బ్యాంకులు భావిస్తున్నట్టని, పరిస్థితి మరింతగా దిగజారకుండా చూసుకోవాల్సి వుందని అభిప్రాయపడ్డారు. ప్రతియేటా మూలధనం నిల్వల కోసం కేంద్రాన్ని ఎందుకు ఆశ్రయించాల్సి వస్తోందో బ్యాంకులు తమను తాము ప్రశ్నించుకోవాలని సూచించారు. వ్యవస్థలోని లోపాలు సైతం బ్యాంకులకు అడ్డుగా నిలుస్తున్నాయని వివరించారు.