: సాయి బాబాపై స్వాముల లడాయి... టీవీ లైవ్ లో వ్యక్తిగత విమర్శలు!
షిరిడీ సాయిబాబా దేవుడా? కాదా? అన్న విషయమై రమణానంద మహర్షి, శ్రీ గోవిందానందల మధ్య ఓ టెలివిజన్ చానల్ చేపట్టిన చర్చా కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఈ ఉదయం 9 గంటల మధ్య ప్రారంభమైన చర్చలో అటు గోవిందానంద, ఇటు రమణానందలు వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఏదైనా శాస్త్రం, వేదం మాత్రమే ప్రమాణమని గోవిందానంద వ్యాఖ్యానించగా, వేదాలు, శాస్త్రాలూ లేనే లేవని, వాటిని తాము నమ్మబోమని రమణానంద చెప్పడంతో చర్చ పక్కదారి పట్టింది. సాయిబాబా హిందువా, ముస్లిమా, తల్లిదండ్రులు ఎవరు? హిందూ దేవుడిగా ఎందుకు చూపిస్తున్నారు? ఆయన ఏ శాస్త్ర పరంపరకు చెందినవాడని గోవిందానంద ప్రశ్నలను కురిపించారు. సాయి మతాతీతుడని, తల్లిదండ్రులు లేని శివస్వరూపమని రమణానంద చెప్పుకొచ్చారు. మరోవైపు సాయిపై జరుగుతున్న చర్చను తిలకించిన పలువురు భక్తులు చానల్ కార్యాలయానికి వచ్చి తమ నిరసన తెలుపుతుండటంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. చానల్ వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించారు. ఈ చర్చను తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది ఆసక్తిగా తిలకిస్తుండగా, మాడుగుల నాగఫణిశర్మ, జొన్నవిత్తుల తదితర పలువురు ప్రముఖులు స్పందించి తమ అభిప్రాయాలు చెబుతూ, ఇద్దరికీ బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు.