: ఎట్టకేలకు ముంబయి హజీ అలీ దర్గాలో తృప్తి దేశాయ్ ప్రార్థనలు.. త్వరలోనే దర్గా గర్భాలయంలోకి వెళతామని ఉద్ఘాటన
దేశంలో లింగభేద నిర్మూలన కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తూ దేశంలోని పలు ప్రసిద్ధ ఆలయాల్లో మహిళల ప్రవేశం కోసం పోరాడుతోన్న భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ ఈరోజు ఉదయం ముంబయిలోని హజీ అలీ దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. తృప్తి దేశాయ్ దర్గాలోకి ప్రవేశిస్తే ఊరుకోబోమంటూ వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే దర్గా గర్భాలయంలోకి తృప్తి దేశాయ్ ప్రవేశించలేదు. దర్గా వద్ద ప్రార్థనలు నిర్వహించిన ఆమె అనంతరం మాట్లాడుతూ... త్వరలోనే మహిళలు దర్గా గర్భాలయంలోకి ప్రవేశిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ఈ విషయంపైనే దర్గాలో ప్రార్థనలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు. తృప్తి దేశాయ్ దర్గాలోకి ప్రవేశించే సమయంలో ఛాందస వాదులనుంచి వ్యతిరేకత వచ్చింది. దీంతో అక్కడ స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది.