: ‘అనంత’ టూ అమరావతి జర్నీ 6 గంటలే!... మలుపులు లేని రోడ్డుకు చంద్రబాబు ఆదేశం!


రాష్ట్ర విభజన తర్వాత ఓ ముక్కగా మిగిలిన నవ్యాంధ్రప్రదేశ్ లో రహదారులకు మహర్దశ పట్టనుంది. గుంటూరు జిల్లాలో కొత్తగా ఏర్పాటవుతున్న నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి అన్ని ప్రాంతాల నుంచి నేరుగానే కాక త్వరితగతిన చేరుకునేలా అంతర్జాతీయ స్థాయిలో రహదారుల నిర్మాణానికి ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక నేటి తన సంచికలో ఓ ఆసక్తికర కథనాన్ని రాసింది. ప్రస్తుతం ఏపీకి ఓ మూలన... కర్ణాటకకు సరిహద్దుగా ఉన్న అనంతపురం నుంచి అమరావతి చేరుకోవాలంటే హీనపక్షం 9 గంటలకు పైగా సమయం పడుతుంది. అదే చంద్రబాబు ఆదేశించిన మేరకు రహదారి నిర్మాణం పూర్తయితే ఈ ప్రయాణ దూరం ఏకంగా 6 గంటలకు తగ్గిపోతుంది. సాంతం రోడ్డు వెంట ఏ చిన్న మలుపు, వంకర లేకుండా నిర్మించనున్న ఈ రహదారి కోసం భూసేకరణకు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ రహదారికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, భూసేకరణ ముగిసిన వెంటనే నిర్మాణ పనులు మొదలవుతాయి. ఈ రోడ్డు నిర్మాణంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు పాటించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం దేశంలో ఎక్కడ కూడా మలుపులు లేేని రహదారులు లేవు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో, శాన్ డియాగో, లాస్ ఏంజెలిస్, డల్లాస్, టెక్సాస్ తదితర ప్రాంతాల్లోనే ఈ రోడ్డున్నాయి. దీంతో వీటిపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ఆర్ ఆండ్ బీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంబాబుతో పాటు ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర నిన్ననే అమెరికా బయలుదేరి వెళ్లారు. అక్కడి మలుపులు లేని రోడ్లను పరిశీలించనున్న వీరిద్దరూ వాటి నిర్మాణంలో వాడిన సాంకేతిక పరిజ్ఞానంపై అక్కడి అధికారులతో చర్చలు జరుపుతారు. ఇక వీరి పర్యటన ముగిసిన తర్వాత ఇంజినీరింగ్ అధికారులను కూడా అక్కడికి పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అనంతపురం- అమరావతి రహదారి తరహాలో అమరావతి- విశాఖ, అమరావతి- రాజమహేంద్రవరం రహదారులను కొత్తగా నిర్మాణం కానున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News