: మిషన్ భగీరథకు ఎల్ఐసీ దన్ను!... రుణంపై నేడు తెలంగాణ సర్కారుతో కీలక చర్చలు
ఇంటింటికీ రక్షిత మంచి నీటిని అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ (వాటర్ గ్రిడ్) పధకానికి జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ దన్ను లభించనుంది. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో తొలి అధికారం చేపట్టిన టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు... మిషన్ కాకతీయతో పాటు మిషన్ భగీరథ పథకాలను ప్రకటించారు. ప్రస్తుతం ఈ పథకాలు శరవేగంగా సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లోగా మిషన్ భగీరథను పూర్తి చేయాలన్న సంకల్పంతో సర్కారు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ఈ పథకానికి ఎల్ఐసీ రుణం అందజేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మేరకు నేడు హైదరాబాదు రానున్న ఎల్ఐసీ ఉన్నతాధికారులు తెలంగాణ సర్కారుకు చెందిన కీలక అధికారులతో ప్రత్యేక చర్చలు జరపనున్నారు. రుణానికి సంబంధించిన ప్రకటన కూడా నేడు విడుదల కానుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.