: ఏపీని దెబ్బకొట్టిన కేంద్రం!... కేవీపీ బిల్లును తప్పించుకునేందుకు ముందుగానే సభ వాయిదా!


ప్రత్యేక హోదా కోసం పోరుబాట పట్టిన నవ్యాంధ్రప్రదేశ్ కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెద్ద దెబ్బే కొట్టింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి సవరణ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లు రేపు సభ ముందుకు రానుంది. ఈ మేరకు రాజ్యసభ సెక్రటేరియట్ ఇప్పటికే సదరు బిల్లును నోటిఫై కూడా చేసింది. ఈ క్రమంలో రాజకీయంగా ఆగర్భ శత్రువులుగా కొనసాగుతూ వస్తున్న కాంగ్రెస్, టీడీపీలు ఒక్కదరికి చేరాయి. కాంగ్రెస్ నేత ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతు పలకాలని టీడీపీ అధినేత హోదాలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన పార్టీ ఎంపీలకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అధికార బీజేపీ ఒక్కసారిగా తన వ్యూహాలకు పదును పెట్టింది. సభా సమావేశాలను నిర్దేశిత సమయం కంటే ముందుగానే వాయిదా వేస్తే సరిపోతుంది కదా అన్న దిశగా యోచించిన కేంద్రం... ఆ దిశగానే అడుగులు వేసింది. నిర్దేశిత సమయం కంటే రెండు రోజులు (నిన్న) ముందుగానే లోక్ సభను వాయిదా వేసేసిన కేంద్రం... ఓ రోజు ముందుగానే (నేడు) రాజ్యసభను వాయిదా వేసేందుకు నిర్ణయించింది. నేడు రాజ్యసభ నిరవధిక వాయిదా పడితే... రేపు సభ ముందుకు రానున్న కేవీపీ బిల్లు... తదుపరి సమావేశాల్లో కాని సభలో ప్రస్తావనకు రాదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయం నుంచి తప్పించుకునేందుకు నరేంద్ర మోదీ సర్కారుకు ఇంతకంటే ప్రత్యామ్నాయ మార్గం కనిపించలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక వచ్చే సభలోనైనా ఈ బిల్లు రాజ్యసభ ముందుకు రాక తప్పదు కదా అన్న ప్రశ్నకు కూడా మోదీ సర్కారు వద్ద తగిన సమాధానమే ఉన్నట్లు వినికిడి. త్వరలో రాజ్యసభలో పలువురు సభ్యుల పదవీ కాలం ముగియనుంది. వారి స్థానంలో బీజేపీ నుంచే కాక ఆ పార్టీ మిత్రపక్షాలకు చెందిన పలువురు సభ్యులు ఎన్నిక కానున్నారు. తద్వారా ఆ పార్టీ బలం కూడా పెరగనుంది. రాజ్యసభలో తన బలం పెరిగిన తర్వాత జరగనున్న తదుపరి సమావేశాల ముందుకు ఈ బిల్లు వచ్చినా సమర్ధవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉన్నట్టు ఆ పార్టీ వాదిస్తోంది. వెరసి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదన్న విషయం ఈ చర్యతో తేటతెల్లమైంది.

  • Loading...

More Telugu News