: కేంద్రం కొత్త వ్యూహం... కేవీపీ బిల్లు చర్చకు రాకముందే సభ నిరవధిక వాయిదా
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా రాకుండా అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త అస్త్రాన్ని బయటకు తీస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కల్పించే ప్రైవేటు బిల్లు కోసం కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో విపక్షాల మద్దతు కూడగట్టిన తరుణంలో దీనిని ఎలా అడ్డుకోవాలా? అని ఆలోచించిన ప్రభుత్వం రాజ్యసభను నిరవధిక వాయిదా వేయాలని నిర్ణయించింది. నేటితో రాజ్యసభను నిరవధిక వాయిదా వేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ, కొంత మంది రాజ్యసభ సభ్యుల కాలపరిమితి ముగియనున్న నేపథ్యంలో వారికి వీడ్కోలు పలికేందుకు రేపు సభను యథావిధిగా కొనసాగించాలని భావించింది. దీంతో రేపు వారికి వీడ్కోలు చెప్పిన అనంతరం సభను నిరవధిక వాయిదా వేయనున్నారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా బిల్లు చర్చకు వస్తే...ఆ తరువాత జరిగే ఓటింగ్ లో సంఖ్యాబలం లేని బీజేపీ కంగుతినే ప్రమాదం ఉంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేకహోదా కల్పించాలి...దీనిని తప్పించుకునేందుకు ప్రభుత్వం నిరవధిక వాయిదా మంత్రాన్ని ప్రయోగించనుంది. దీంతో కేంద్రం తన ఉద్దేశ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్పష్టం చేసినట్టైంది.