: రష్యా ఈ బాంబు ప్రయోగిస్తే...ఫ్రాన్స్ లేదా టెక్సాస్ క్షణాల్లో మాయమవుతాయి!
యూరోపియన్ యూనియన్ గుండెల్లో రష్యా రైళ్లు పరుగెత్తిస్తోంది. అత్యంత శక్తిమంతమైన అణ్వాయుధాన్ని పరీక్షించేందుకు రష్యా సన్నాహాలు చేసుకుంటోంది. ఈ క్షిపణికి నాటో రక్షణ వ్యవస్థను చిన్నాభిన్నం చేయగల శక్తి ఉండడం విశేషం. దీనిని ప్రయోగించిన క్షణాల్లో అది యూరోప్ లోని ఓ భాగాన్ని లేకుండా చయగలదు. ఆర్ఎస్-28 సర్మాట్ పేరుతో రూపొందిన దీనిని విక్టరీ పరేడ్ సందర్భంగా మాస్కోలో తొలిసారి ప్రదర్శించారు. దీంతో ఇలాంటి ఒక క్షిపణి రష్యా దగ్గర ఉందన్న విషయం బాహ్యప్రపంచానికి తెలిసింది. దీనిని ప్రయోగించిన ఏడు నిమిషాల్లోనే లక్ష్యాన్ని ఛేదిస్తుందని, సంప్రదాయ మిస్సైల్ రక్షణ వ్యవస్థలన్నింటినీ తునాతునకలు చేయగల సామర్ధ్యం దీని సొంతమని రష్యా చెబుతోంది. దీంతో యూరోపియన్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. నాటో దళాలు దీనిని 'సాతాను-2'గా వ్యవహరిస్తున్నాయి. హిరోషిమా, నాగసాకిపై అమెరికా వేసిన అణుబాంబుల కంటే రెండు వేల రెట్ల సామర్థ్యం గల బాంబులను మోసుకెళ్లగల సత్తా ఈ వార్ హెడ్ సొంతమని రష్యా న్యూస్ నెట్ వర్క్ జ్వెజ్డా తెలిపింది. దీనిని ఈ వేసవిలో పరీక్షించాలని క్రెమ్లిన్ (రష్యా అధక్షుని నివాస భవనం) భావిస్తోందని జ్వెజ్డా వెల్లడించింది. ఈ వార్ హెడ్ సామర్థ్యం 40 మెగాటన్నులని తెలిపింది. దీనిని ప్రయోగిస్తే ప్రపంచ పటం నుంచి ఫ్రాన్స్ దేశం లేదా టెక్సాస్ రాష్ట్రాన్ని క్షణాల్లో మాయం చేయవచ్చని తెలుస్తోంది. దీంతో దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.