: మారిషస్ 'పన్ను' భయంతో అమ్మకాల వెల్లువ!
మారిషస్ నుంచి ఇండియాకు వచ్చే పెట్టుబడులపై 2017 నుంచి పన్ను విధించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లలో భయాందోళనలను పెంచగా, భారత స్టాక్ మార్కెట్ రోలర్ కోస్టర్ ను తలపించింది. సెషన్ ఆరంభంలోనే 380 పాయింట్లు పైగా పతనమైన సెన్సెక్స్, ఆపై కొంత మేరకు కోలుకున్నప్పటికీ, మధ్యాహ్నం తరువాత తిరిగి నష్టాన్ని పెంచుకుంది. చివర్లో కొంత కొనుగోలు మద్దతు వచ్చినప్పటికీ, మార్కెట్ నష్టాలు కొనసాగాయి. ఇదే సమయంలో మిడ్ క్యాప్ మాత్రం మెరిసింది. బుధవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 175.51 పాయింట్లు పడిపోయి 0.68 శాతం నష్టంతో 25,597.02 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 38.95 పాయింట్లు పడిపోయి 0.49 శాతం నష్టంతో 7,848.85 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.17 శాతం లాభపడగా, స్మాల్ కాప్ 0.03 శాతం నష్టపోయింది. ఎన్ఎస్ఈ-50లో 19 కంపెనీలు లాభపడ్డాయి. జడ్ఈఈఎల్, యాక్సిస్ బ్యాంక్, హిందాల్కో, ఆసియన్ పెయింట్స్, బోష్ లిమిటెడ్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, భారతీ ఎయిర్ టెల్, టాటా మోటార్స్, ఎస్బీఐ, టాటా పవర్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,688 కంపెనీలు ట్రేడింగ్ లో పాల్గొనగా, 1,041 కంపెనీలు లాభాలను, 1,499 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. మంగళవారం నాడు రూ. 97,14,365 కోట్లుగా ఉన్న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 96,79,347 కోట్లకు తగ్గింది.