: రమేష్! నీ ప్రాంతం గురించి ఏదో రాసుకొచ్చి చదివితే ఎలా?: రాజ్యసభ్య డిప్యూటీ ఛైర్మన్ కురియన్
రాజ్యసభలో ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఏపీకి రావాల్సిన నిధుల గురించి అడిగిన సందర్భంగా డిప్యూటీ ఛైర్మన్ కురియన్ కల్పించుకుని... 'రమేష్... రమేష్... రమేష్' అని పిలిచారు. అప్పటికీ ఆయన తన ప్రసంగం ఆపకపోవడంతో 'రమేష్ ఒక్క మాట విను' అని అన్నారు. 'ఒక్క నిమిషం' అని రమేష్ అడగడంతో...'అబ్బా! విను రమేష్' అని అన్నారు...'మీ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందా?' అని అడిగారు. 'అవును సర్' అని ఆయన సమాధానమివ్వడంతో 'ఏ ఇబ్బందుల్లో ఉంది?' అని మళ్లీ ప్రశ్నించారు. దీనికి సీఎం రమేష్ చేతిలో ఉన్న పేపర్లను చదివే ప్రయత్నం చేయడంతో 'నీ రాష్ట్రంలో ఉన్న సమస్యలు నీకు తెలియక పేపర్ పై ఉన్న సమాచారం చదువుతున్నావా?' అని అన్నారు. దీంతో సీఎం రమేష్ కొన్ని లెక్కలు చెబుతూ, రెవెన్యూలోటు పూడ్చాలని కోరారు. దీంతో కురియన్ 'శభాష్ రమేష్... ఇది కావాలి...నీ ప్రాంతం గురించి ఏదో రాసుకొచ్చి చదవితే ఎలా?' అని అడిగారు. 'పేపర్లమీద ఆధారపడకుండా ఇలా అడిగితే సమాధానాలు వస్తాయి' ఆయన చెప్పారు. 'ఇలా మాట్లాడాలి రమేష్' అని ఆయన ప్రోత్సహించారు.