: పాస్ పోర్టు రద్దుతో కుదర్లేదు, ఇక కేసు నిరూపించి రప్పించాల్సిందే: మాల్యాపై లోక్ సభలో జైట్లీ
కేవలం విజయ్ మాల్యా పాస్ పోర్టును రద్దు చేసినంత మాత్రాన ఆయన్ను తిరిగి ఇండియాకు తీసుకురావడం కుదరదని లోక్ సభలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. మాల్యాను వెనక్కి పంపించేది లేదన్న బ్రిటన్ ప్రకటనపై విపక్షాలు నిరసనలు తెలుపుతున్న వేళ, జైట్లీ ఓ ప్రకటన చేశారు. "పాస్ పోర్టును రద్దు చేసిన తరువాత, ఆ వివరాల ఆధారంగా మాల్యాను భారత్ కు పంపాల్సిందిగా బ్రిటన్ ను కోరాము. సరైన పాస్ పోర్టు ద్వారా ఓ వ్యక్తి బ్రిటన్ లోకి ప్రవేశించిన తరువాత, అతని పాస్ పోర్టు రద్దయినప్పటికీ, సదరు వ్యక్తిని తిరిగి స్వదేశానికి పంపాల్సిన అవసరం లేదని బ్రిటన్ చట్టాలు చెబుతున్నాయి. దీంతో పాస్ పోర్టు రద్దుతో ఆయన్ను రప్పించడం కుదర్లేదు. ఇక ఆయనపై కేసులను విచారించి, చార్జ్ షీట్ దాఖలు చేసి, దాని ఆధారంగా ఆయన్ను డిపోర్ట్ చేయమని బ్రిటన్ ను కోరుతాం. కేసులపై పూర్తి సాక్ష్యాలు సేకరించి నిరూపించాలంటే కొంత సమయం పడుతుంది" అని జైట్లీ తెలిపారు.