: నిండు గర్భిణిని ఆసుప‌త్రి నుంచి బ‌య‌టకు గెంటేశారు.. క‌లెక్ట‌ర్ స్పందించ‌డంతో వైద్యం చేశారు


వ‌రంగల్‌లోని సీకేఎం ఆసుప‌త్రి సిబ్బంది నిండు గ‌ర్భిణి ప‌ట్ల తీవ్ర నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌స‌వం కోసం వ‌చ్చిన ఆమెను ఆసుప‌త్రిలో చేర్చుకోలేదు. అక్క‌డి నుంచి హైదరాబాద్ ఆసుపత్రికి వెళ్లమంటూ బ‌య‌ట‌కు గెంటేశారు. నాలుగు గంట‌ల‌పాటు గ‌ర్భిణి న‌ర‌క‌యాత‌న అనుభ‌వించింది. చివ‌రికి క‌లెక్ట‌ర్ జోక్యంతో అదే ఆసుప‌త్రిలో వైద్యం జ‌రిగింది. ఆదిలాబాద్ దండేపల్లిలోని గుడిరేవు గ్రామానికి చెందిన సుజాతకు వ‌రంగంల్‌లోని సీకేఎం ఆసుప‌త్రిలో ఈ అనుభ‌వం ఎదురైంది. సుజాతకు మలేరియా జ్వరంతో పాటు కామెర్లు సోకి, ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో హైదరాబాద్ వెళ్లి అక్క‌డి ఆసుప‌త్రిలో చికిత్స పొందాలని సుజాతతో చెప్పిన‌ట్లు వ‌రంగ‌ల్ సీకేఎం ఆసుప‌త్రి సిబ్బంది చెప్పారు. అయితే హైద‌రాబాద్ వెళ్లే వ‌ర‌కు త‌న ప‌రిస్థితి మ‌రింత విష‌మంగా మారుతుంద‌ని భావించిన సుజాత వ‌రంగంల్ సీకేఎం ఆసుప‌త్రి మెట్ల‌పైనే కూర్చుంది. దీంతో గర్భిణి బంధువులు జిల్లా కలెక్టర్‌కి ప‌రిస్థితిని విన్న‌వించుకున్నారు. దీనిపై స్పందించిన క‌లెక్ట‌ర్ సుజాత‌కు వైద్యం అందించాల‌ని సీకేఎం ఆసుప‌త్రి వైద్యుల‌ను ఆదేశించారు. అనంత‌రం సుజాత‌కు వైద్యం అందించారు. సుజాత పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. త‌ల్లి, శిశువు ఆరోగ్యంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. అయితే గ‌ర్భిణిల ప‌ట్ల ఆసుప‌త్రి వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News