: మద్య నిషేధమున్న బీహార్ లో మహిళా ఎమ్మెల్సీ ఇంట లిక్కర్... సస్పెన్షన్, అరెస్ట్ కు రంగం సిద్ధం!
ప్రేమగా పెంచుకున్న కొడుకు చేసిన పని ఆ తల్లినిప్పుడు ఊచల వెనక్కు నెడుతోంది. గత వారంలో తన కారును ఓవర్ టేక్ చేశాడన్న కోపంతో యువకుడిని కాల్చి చంపి, మూడు రోజుల పాటు పారిపోయి పోలీసులకు చిక్కిన రాఖీ యాదవ్ తల్లి, బీహార్ మహిళా ఎమ్మెల్సీ మనోరమా దేవి ఇంట్లో భారీ ఎత్తున మద్యం బాటిళ్లు ఉన్నట్టు పోలీసులు కనుగొన్నారు. రాఖీ యాదవ్ అరెస్ట్ కోసం వెళ్లిన సమయంలో ఈ మద్యం బాటిళ్లు కనిపించడంతో, నిషేధిత వస్తువులను ఇంట్లో ఉంచుకున్న నేరానికి ఆమెపై కేసు నమోదైంది. విషయం తెలిసిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, తమ పార్టీ ఎమ్మెల్సీ అయినప్పటికీ, ఆమెను సస్పెండ్ చేస్తూ, గత రాత్రి నిర్ణయాన్ని ప్రకటించారు. కొత్త ప్రొహిబిషన్ చట్టం ప్రకారం నేడు ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ఏ క్షణమైనా మనోరమను అదుపులోకి తీసుకుంటామని సీనియర్ పోలీసు అధికారి నైయ్యార్ హుస్సేన్ ఖాన్ వెల్లడించారు. ఆమె ఇంటిని సీజ్ చేసినట్టు తెలిపారు. కాగా, నిన్నటి నుంచి ఆమె ఫోన్ పనిచేయడం లేదని సమాచారం. ఆమె ఎక్కడ ఉన్నారన్నది తెలియరాలేదు.