: న్యాయమూర్తులు రాజీనామా చేసి ఎమ్మెల్యేలుగా గెలిచి అప్పుడు చెప్పండి: నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్రలో జరగాల్సిన ఐపీఎల్ పోటీలను అక్కడ నుంచి తరలించాలని తీర్పిచ్చిన బాంబే హైకోర్టు న్యాయమూర్తులపై కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం చేయాల్సిన పనిని న్యాయమూర్తులు చేయాలని భావిస్తే, ముందు వారు రాజీనామా చేసి, ఎమ్మెల్యేలుగా గెలిచి, మంత్రి పదవులు పొంది అప్పుడు చేయాలని అన్నారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. మౌలిక వసతులు కల్పించడం, రహదారుల నిర్మాణం, నీటి రవాణా పనులు చేబట్టడం అంటే తన దేశభక్తిని తాను చాటుకోవడమేనని అన్న ఆయన, వచ్చే మూడేళ్లూ తానో 20-20 బ్యాట్స్ మెన్ గా పరుగులు తీయాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ రెండేళ్లలో కొత్త మోటారు వాహన చట్టాన్ని తేలేకపోవడం కొంత బాధను కలిగిస్తోందని, వచ్చే మూడేళ్లలో దాన్ని తెచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. మైనర్ కొడుకుకు బెంజ్ కారిచ్చి ఒకరి మరణానికి కారణమైన ధనవంతుడికి కఠిన శిక్ష విధించాల్సి వుందని, అప్పుడే మరోసారి ఈ తరహా ఘటనలు జరగకుండా ఉంటాయని గడ్కరీ అభిప్రాయపడ్డారు.