: ఉండవల్లి, పెనుమాకల్లో పవన్ కల్యాణ్ ప్లెక్సీలు... కాపాడాలని కోరుతున్న రైతులు!


అమరావతికి స్వచ్ఛందంగా భూములను ఇచ్చేందుకు అంగీకరించని రైతులు, ఇప్పుడు మరోసారి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వీరి భూములను బలవంతంగానైనా తీసుకోవాలని భావిస్తున్న ఏపీ సర్కారు భూ సేకరణ చట్టం ప్రయోగించేందుకు సిద్ధమవుతుండగా, రైతులు తమ పొలాల్లో పవన్ ఫోటోలతో కూడిన ప్లెక్సీలు పెట్టి, తమను ఆదుకోవాలని కోరుతున్నారు. విజయవాడకు అతి సమీపంలో ఉన్న ఉండవల్లి, పెనుమాక, మంగళగిరి భూముల యజమానులు ఇప్పటికే పూర్తి అభివృద్ధి చెందిన తమ భూములను ఇచ్చేది లేదని తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే. మిగతా ఊర్లలోని రైతుల మాదిరిగా తమకూ ప్యాకేజీలు ఇస్తే నష్టపోతామన్నది వీరి అభిప్రాయం. కాగా, గతంలో చంద్రబాబు సర్కారు భూ సమీకరణ జీవో జారీ చేయాలని చూసిన సమయంలో, ఈ ప్రాంతంలో పర్యటించిన పవన్, బలవంతపు భూ సేకరణ చేస్తే తాను దీక్షకు దిగుతానని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అప్పట్లో వెనక్కు తగ్గిన ప్రభుత్వం, ఇప్పుడు తిరిగి అదే పని చేయాలని చూస్తుండటంతో, రైతుల్లో భయాందోళనలు పెరిగాయి. ఈ విషయంలో పవన్ మరోసారి కల్పించుకుని తమ ప్రాంతంలో పర్యటించి, భూ సేకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్నది ఈ ప్రాంత రైతుల అభిప్రాయం.

  • Loading...

More Telugu News