: భద్రతా వలయంలోకి అమరావతి... పలు నిషేధాజ్ఞలు!
అమరావతిలో జరుగుతున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనుల స్థలంలో నిన్న జరిగిన సంఘటనలో ఏపీ సర్కారు మేల్కొంది. ఈ ప్రాంతం చుట్టూ భద్రతా వలయం ఏర్పాటు చేసింది. భవన నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతంలో 144 సెక్షన్ విధించింది. ఈ పరిసరాల్లో ప్రదర్శనలు, ఆందోళనలను నిషేధించింది. ఈ ప్రాంతానికి ప్రైవేటు వ్యక్తుల రాకపోకలను నియంత్రించాలని భావించిన అధికారులు ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి తనిఖీలు చేయాలని నిర్ణయించారు. స్థానికుల రాకపోకలను సైతం నియంత్రించాలని భావిస్తున్నారు. దీంతో అమరావతి పరిధిలోని వెలగపూడి పూర్తిగా భద్రతా వలయంలోకి వెళ్లినట్లయింది. పరిస్థితులను జేపీ శ్రీధర్ నేతృత్వంలో పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. నిన్న జరిగినటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడటమే తమ లక్ష్యమన్నారు.