: చంద్రబాబుకు భారీ షాక్... టీఆర్ఎస్ లోకి తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ!
టీడీపీ తెలంగాణ విభాగానికి, అంతకుమించి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి పెద్ద షాక్ ఇస్తూ, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ సైతం టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిపోనున్నారన్న వార్తలు సంచలనం కలిగిస్తున్నాయి. మొత్తం 15 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 12 మంది టీఆర్ఎస్ లోకి చేరిపోగా, సండ్ర వెంకటరమణ సైతం అదే దారిలో ఉన్నారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక టీడీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదన్న భయంతో ఉన్న ఎల్.రమణ, ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావులతో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చిన తరువాత, తమ అధినేత తెలంగాణ వ్యవహారాలను పట్టించుకోవడం లేదని, పార్టీలు ఫిరాయిస్తున్న వారిని కనీసం నిలువరించే ప్రయత్నాలు కూడా చేయలేదని మథనపడుతున్న తెలుగుదేశం నేతలు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇక అదే పార్టీలో ఉంటే అర్థం లేదని భావిస్తున్నట్టు సమాచారం. రెండోసారి టీటీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ, రేవంత్ తరువాతనే తన స్థానమనే భావనలో ఉన్న రమణ సైతం అదే దారిలో ఉన్నారని తెలుస్తోంది. జగిత్యాల నియోజకవర్గంలో అటు టీడీపీ తరఫున పోటీ చేసిన ఎల్.రమణ, టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోగా, కాంగ్రెస్ కు చెందిన జీవన్ రెడ్డి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు రమణ ఉపయోగపడతారని భావిస్తున్న హరీశ్ స్వయంగా ఆయన్ను కలిసి లంచ్ మీటింగ్ పెట్టుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక అన్నీ అనుకూలిస్తే, అతి త్వరలో రమణ, గులాబీ గూటికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.