: ఇటు తలసాని... అటు రేవంత్, నామా, సండ్ర!: పాలేరులో పేలనున్న మాటల తూటాలు!


ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు సంబంధించి ప్రచారం హోరెత్తుతోంది. ఓ వైపు అధికార పార్టీ టీఆర్ఎస్, మరోవైపు విపక్షాలన్నీ ఏకమై బరిలోకి దిగాయి. ఇప్పటికే ఇక్కడి ప్రచారంలో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే నిన్నటిదాకా జరిగిన ప్రచారం ఒక ఎత్తు కాగా, నేడు జరగనున్న ప్రచారం మరో ఎత్తు అన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే... టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తరఫున ప్రచారం చేసేందుకు మరో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ నేడు పాలేరుకు వెళ్లనున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుచరితారెడ్డికి మద్దతు పలికిన టీ టీడీపీ ఆమె విజయం కోసం నేడు కీలక ప్రచారం చేయనుంది. టీ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డితో పాటు ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నేడు పాలేరులో ప్రచారంలో పాల్గొననున్నారు. రేవంత్, నామా, సండ్రలతో పాటు తలసాని కూడా మొన్నటిదాకా టీడీపీలోనే ఉన్న విషయం తెలిసిందే. అయితే మారిన రాజకీయ పరిణామాల్లో భాగంగా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న తలసాని కేసీఆర్ కేబినెట్ లో మంత్రి అయ్యారు. ఈ క్రమంలో ఆయన టీడీపీ నేతలపై పలు సందర్భాల్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేడు కూడా ఆయన టీడీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తనున్నారు. ఇక తలసాని వ్యాఖ్యలకు రేవంత్, నామా, సండ్రలు ఎలాంటి కౌంటర్లిస్తారో చూడాలి.

  • Loading...

More Telugu News