: తన వారసుడు స్టాలిన్ అని మరోసారి ప్రకటించిన డీఎంకే అధినేత కరుణానిధి!
సహజసిద్ధంగా ఒకవేళ తనకు ఏదైనా జరిగితే స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతాడని డీఎంకే అధినేత కరుణానిధి తన మనసులో మాట చెప్పారు. చెన్నైలోని డీఎంకే పార్టీ హెడ్ క్వార్టర్స్ లో ఒక ఇంగ్లీషు ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలిస్తే కనుక, ఆరోసారి తాను ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠిస్తానని తొంభై మూడేళ్ల కరుణానిధి చెప్పారు. కాగా, చిన్న కొడుకు స్టాలిన్ తన రాజకీయ వారసుడని 2013లో కరుణానిధి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత డీఎంకేకు ఆశాజనకమైన పరిస్థితులు లేవు. ప్రస్తుతం నడవలేని పరిస్థితుల్లో ఉన్న కరుణానిధి వీల్ చైర్ కే పరిమితమయ్యారు. ఈ నెల 16వ తేదీన జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే లు తమ గెలుపు తథ్యమని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తుండటం గమనార్హం.