: విద్యార్థుల బిగి 'కౌగిలి'లో చెట్లు...యాజమాన్యం దారుణానికి అడ్డుకట్ట!


70వ దశకంలో భారతదేశాన్ని పట్టి కుదిపేసిన 'చిప్కో ఉద్యమం' (ఉత్తరప్రదేశ్ లోని అడవుల్లో చెట్లను నరికివేయడాన్ని నిరసిస్తూ, అక్కడి ప్రజలు చెట్లను బలంగా కౌగిలించుకుని ప్రతిఘటించడంతో ప్రారంభమైన ఉద్యమం) స్పూర్తితో కళాశాల యాజమాన్యం మూర్ఖత్వాన్ని బెంగళూరు విద్యార్థులు అడ్డుకున్న ఘటన అందర్నీ ఆకట్టుకుంటోంది. బెంగళూరులోని బీఎంఎస్ కళాశాల ఆవరణలో కొత్త కోర్సుల కోసం ఓ అదనపు భవనాన్ని నిర్మించారు. దీనికి రహదారి కోసం ఆ భవన ప్రాంగణంలో గల 50 చెట్లను నరికేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ చెట్లలో 80 ఏళ్ల పురాతన వృక్షమంటే అక్కడి విద్యార్థులకు వల్లమాలిన అభిమానం. విశాలమైన తన కొమ్మలతో రారమ్మన్నట్టు పిలిచే ఆ వృక్షంతో కళాశాలకు చెందిన ప్రతి విద్యార్థికీ ఓ మధురానుభూతి, మరపురాని అనుభవం వున్నాయి. అలాంటి చెట్టును కూడా నరికివేయనున్నారన్న వార్త విద్యార్థులను కలచి వేసింది. గత ఆదివారం ఉదయం కళాశాల ఆవరణలో చెట్లను నరికేసి దారి చేస్తున్నారన్న వార్త తెలియడంతో 50 మంది విద్యార్థులు పరుగుపరుగున కళాశాల ఆవరణకు చేరుకున్నారు. వారు వచ్చేసరికే రెండు చెట్లు కూలిపోయి బావురుమంటున్నాయి. మూడో చెట్టు నరికేందుకు సిబ్బంది ఉద్యుక్తులవుతుండగా, కర్తవ్యం గుర్తుకువచ్చిన వీరుల్లా విద్యార్థులు కదిలారు. చెరో చెట్టును కౌగిలించుకుని తమతోపాటే వాటిని కూడా కూల్చాలని సవాల్ విసిరారు. దీంతో కళాశాల యాజమాన్యం పరుగుపరుగున సంఘటనా స్థలికి చేరుకుని, బెదిరింపులకు దిగింది. విద్యార్థుల సంఖ్య పెరిగి, వార్త వ్యాపించడంతో సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. ఈ తతంగం ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు సాగింది. కళాశాల యాజమాన్యం 80 ఏళ్ల పురాతన వృక్షానికి సబంధించిన రెండు కొమ్మలను నరికేసింది. ఇలా కాదని భావించిన విద్యార్థులు ఆన్ లైన్ పిటిషన్ ప్రారంభించారు. 20 గంటల్లో వీరికి 1,700 మందికిపైగా మద్దతు తెలిపారు. దీంతో కళాశాల యాజమాన్యం చెట్ల నరికివేతకు బ్రేక్ చెప్పింది. దీంతో వారిని అంతా అభినందిస్తున్నారు.

  • Loading...

More Telugu News