: మా బ్రేకప్ కు సాక్ష్యం కావాలా...ఇదిగో!: సుశాంత్ సింగ్ రాజ్ పుత్
ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ను ఆశ్చర్యంలో ముంచెత్తిన ఘటన ఏదైనా ఉందంటే, అది సుశాంత్ సింగ్ రాజ్ పుత్, అకింతా లోఖండే బ్రేకప్. ఏళ్ల తరబడి డేటింగ్ చేసిన ఈ ఇద్దరూ వివాహం చేసుకుంటామని ఈ మధ్యే ప్రకటించారు. ఇంతలో కృతి సనోన్ తో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ 'రబ్తా' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా అంగీకరించిన నాటి నుంచి ఆమెతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పొస్టు చేస్తున్నాడు. గతంలో చాలా సినిమాల్లో సుశాంత్ నటించినప్పటికీ ఆ హీరోయిన్ల ఫోటోలను ఎప్పుడూ తన ఖాతాలో పోస్టు చేయలేదు. గతంలో 'శుద్ధ్ దేశీ రొమాన్స్' సినిమాలో హీరోయిన్ పరిణీతి చోప్రాతో గ్లామర్ రోల్ లో నటించినప్పటికీ ఆమెతో పోటోలను అంత ఎక్కువగా పోస్టు చేయలేదు. దీంతో వీరిద్దరిమధ్య దూరం పెరిగి విడిపోయారు. ఈ సందర్భంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆమెను పరోక్షంగా ఎత్తిపొడుస్తూ...'ఆమె తాగుబోతు కాదు, నేను తిరుగుబోతును కాదు' అంటూ ఓ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఆ తరువాత వారిద్దరూ సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తనకు ప్రేమించడం ఎలాగో తెలుసు అంటూ అంకితా లోఖండే ట్వీట్ చేశారు. దానికి ప్రతిగా సుశాంత్ సింగ్...తామిద్దరం విడిపోవడానికి కారణం కావాలా? అంటూ, 'అయితే ఈ కారణానికి దగ్గరగా ఉన్న సాక్ష్యం ఇదే' అంటూ గతంలో ఓ వెబ్ సైట్ తయారు చేసిన వీడియో లింకును పోస్టు చేశాడు. ఇందులో ఫుల్లుగా తాగిన అంకిత అతనిని తిడుతున్నట్టు కనబడుతుంది.