: @599కే ఐఫోన్ అంటూ గాలం వేసి... 1,98,712 రూపాయలు ఊడ్చేశారు!
ఐదంకెల ధర కలిగిన ఐఫోన్ ను కేవలం 599 రూపాయలకు అందిస్తామని చెప్పగానే నమ్మిన వ్యక్తిని నిలువునా మోసం చేసిన ఘటనపై మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాల్లోకి వెళ్తే...నారాయణ్ ఘడగే (50) పూణేలోని కట్రాజ్ లో నివాసం ఉంటున్నారు. రెండేళ్ల క్రితం ఇంట్లో కంప్యూటర్ వినియోగిస్తుండగా bigsop.comలో ఐఫోన్ కేవలం 599 రూపాయలకే అనే యాడ్ ప్రత్యక్షమైంది. దీంతో కుటుంబ సభ్యులను సంప్రదించి ఆ ఫోన్ కు ఆర్డర్ చేసి, ఆన్ లైన్ పేమెంట్ కూడా చేశారు. ఓ గంట తరువాత ఆయనకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాము ఈ కామర్స్ నుంచి మాట్లాడుతున్నామని, ట్రాంశాక్షన్ వివరాలు మీవి అవునో కాదో నిర్ధారించుకోవాలని చెప్పండంటూ అవతలి వ్యక్తులు అడిగారు. ఈ సందర్భంగా బ్యాంకు అకౌంట్ నెంబర్, ఏటీఎం పాస్ వర్డ్, ఆన్ లైన్ బ్యాంకింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో ఐఫోన్ వచ్చేసిందని నారాయణ్ భావించారు. ఆ రోజు అర్ధ రాత్రి సమయంలో ఆయన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. దీంతో తనకు ఫోన్ వచ్చిన నెంబర్ కు ఫోన్ చేసి ఆరాతీయగా, చెక్ చేసి లోపం ఉంటే మీ ఖాతాలో జమ చేస్తామంటూ నమ్మబలికారు. దీంతో సమస్య పరిష్కారమైందని భావించిన ఆయన ప్రశాంతంగా నిద్రపోయారు. తరువాత రెండు రోజుల వ్యవధిలో ఆయన అకౌంట్ నుంచి 1,98,712 రూపాయలు విత్ డ్రా అయినట్టు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి ఫలితం లేకపోవడంతో తాజాగా ఆయన మరోసారి సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. 2014లో దీనిపై ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని, చెబుతూ ఆయన మరోసారి ఫిర్యాదు చేయడంతో, అతని కేసును స్వీకరించిన పోలీసులు, అతనికి న్యాయం చేస్తామని చెప్పారు.