: సాధారణం కన్నా 14 శాతం వర్షాలు తక్కువ పడ్డాయని మోదీకి వివరించా: ప‌్రధానితో భేటీ అనంతరం సీఎం కేసీఆర్
తెలంగాణలోని కరవు పరిస్థితిపై ప్రధాని నరేంద్రమోదీకి వివరించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఢిల్లీలో గంటన్నర పాటు ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమైన కేసీఆర్ అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణలో సాధారణం కన్నా 14శాతం వర్షాలు తక్కువ పడ్డాయని, దీంతో ప్రజలు కరవు కోరల్లో చిక్కుకున్నట్లు మోదీకి వివరించినట్లు ఆయన తెలిపారు. ప్రత్యేకంగా నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిస్థితి దారుణంగా ఉందని మోదీకి తెలిపానన్నారు. తెలంగాణకు రావాల్సిన కరవు సహాయక నిధులను కోరినట్లు చెప్పారు. 7 జిల్లాల్లో 231 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించామని మోదీతో తెలిపినట్లు చెప్పారు. రాష్ట్రంలో కరవును ఎదుర్కొనడానికి తాత్కాలికంగా చేపట్టిన కార్యక్రమాలను మోదీకి కేసీఆర్ వివరించారు. కరవును ఎదుర్కొవడానికి అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. కరవుని శాశ్వతంగా నివారించేందుకు కేంద్రం నుంచి నిధులు అందించాలని కోరినట్లు కేసీఆర్ తెలిపారు.