: ఏపీలో ఆరోగ్య ఏటీఎంలు... తలనొప్పంటే తలనొప్పి మాత్ర వస్తుంది!


ఏటీఎంలు అంటే ఇప్పటివరకూ డెబిట్ కార్డుతో నగదు డ్రా చేసుకుంటామన్న విషయమే అందరికీ తెలుసు. కొన్ని ప్రాంతాల్లో డబ్బు చెల్లిస్తే, కూల్ డ్రింక్స్, తినుబండారాల ప్యాకెట్లు, మరికొన్ని చోట్ల బంగారం నాణాలు ఇచ్చే ఏటీఎంలు ఉంటాయని కొందరికి తెలుసు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో ముందడుగు వేయనుంది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రజల వైద్య సేవలను మరింత మెరుగుపరిచే దిశగా హెల్త్ కేర్ ఏటీఎంలను ఏర్పాటు చేయనుంది. వీటిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 25 హెల్త్ కేర్ ఏటీఎంలను ఏర్పాటు చేయాలని కొద్ది సేపటి క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెల్లూరు జిల్లాలో ఒకటి, మిగిలిన అన్ని జిల్లాల్లో రెండు చొప్పున వీటిని సత్వరమే ప్రారంభించాలని ఆదేశించింది. ఈ ఏటీఎం సెంటర్లలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఔషధాలు లభిస్తాయి. తలనొప్పి, మధుమేహం, జ్వరం వంటి రోగాలకు ఔషధాలు ఒక్క క్లిక్ తో లభిస్తాయి. వాస్తవానికి హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో హెల్త్ కేర్ ఏటీఎంలను ఏర్పాటు చేయాలని మార్చిలోనే కేంద్రం నిర్ణయించింది. వీటి ద్వారా పేదలకు ఉచితంగా మందులు ఇవ్వాలన్నది మోదీ సర్కారు నిర్ణయం. హెల్త్ వర్కర్లు, ఏఎన్ఎంల ద్వారా వీటిల్లో ఔషధాలను నింపుతారు. ఒకవేళ రుగ్మత అధికంగా ఉంటే, ఏటీఎం మెషీన్ ద్వారానే సమీపంలోని అంబులెన్స్ కు సమాచారం ఇచ్చేందుకు కూడా వీలుంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ అవసరం కాగా, ఇండియాలో ప్రతి రెండు వేల మందికి ఒక డాక్టర్, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 18 వేల మందికి ఒక డాక్టర్ మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఈ నేపథ్యంలో హెల్త్ కేర్ ఏటీఎంలకు మంచి స్పందన ఉంటుందని అంచనా. నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రీసెర్చ్ సెంటర్ ఈ మెషీన్లను తయారు చేస్తోంది. బాలారిష్టాలను అధిగమించి ఈ స్కీమ్ విజయవంతమైతే అన్ని రాష్ట్రాల్లోని పేదలకు ఉచితంగా మందులు అందుతాయి.

  • Loading...

More Telugu News