: ప్రియాంక పక్కనుంటే రాబర్ట్ కు విమానాశ్రయాల్లో చెకింగ్ నుంచి మినహాయింపు!
విమానాశ్రయాల్లో సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఒంటరిగా వెళుతుంటే మాత్రమే సెక్యూరిటీ చెకింగ్ జరుగుతుందని, ఆయన తన భార్య ప్రియాంకా గాంధీతో కలిసి ప్రయాణిస్తుంటే మాత్రం చెకింగ్ నుంచి మినహాయింపు పొందుతారని విమానయాన అధికారులు స్పష్టం చేశారు. దేశంలో స్పెషల్ ప్రొటెక్షన్ భద్రతలో ఉన్న 30 మందిలో ప్రియాంక కూడా ఉన్నారని, ఆమెతో కలిసి వెళుతుంటే, వాద్రాను చెక్ చేయరని, ఆమె మినహా సోనియా, రాహుల్ సహా ఎవరితో వెళుతున్నా చెకింగ్ కు సహకరించాల్సిందేనని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాగా, గత సంవత్సరం సెప్టెంబరు వరకూ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ 'నో ఫ్రిస్కింగ్' (ఎటువంటి చెకింగ్ లేకుండా ప్రయాణానికి అనుమతి) జాబితాలో రాబర్ట్ పేరు ఉండగా, ఆపై మోదీ సర్కారు ఆయనకు ఆ సౌకర్యాన్ని తొలగించిన సంగతి తెలిసిందే. అయితే, జీవిత భాగస్వామి నో ఫ్రిస్కింగ్ జాబితాలో ఉంటే మాత్రం ఆ సౌకర్యం భర్తకు / భార్యకు లభిస్తుందన్న నిబంధన ప్రకారం, వాద్రా చెకింగ్ లేకుండా విమానం ఎక్కాలంటే, ప్రియాంక పక్కనుండాల్సిందే.