: గడువు ముగిసింది!... ఉత్తరాఖండ్ లో మళ్లీ అమల్లోకి వచ్చిన రాష్ట్రపతి పాలన!


ఉత్తరాఖండ్ లో మళ్లీ రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. మైనారిటీలో పడిన హరీశ్ రావత్ సర్కారు తన బలాన్ని నిరూపించుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం అవకాశం కల్పించడంతో రెండు గంటల పాటు (ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు) ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను కేంద్రం ఎత్తివేసింది. 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గోడ దూకిన నేపథ్యంలో హరీశ్ రావత్ కు పదవీ గండం వచ్చి పడింది. దీంతో ఆ రాష్ట్ర అసెంబ్లీని సుప్త చేతనావస్థలో పెట్టిన కేంద్రం... రాష్ట్రపతి పాలనను విధించింది. సుప్రీంకోర్టు మొట్టికాయలతో అయిష్టంగానే హరీశ్ రావత్ సర్కారు బల పరీక్షకు తలాడించిన కేంద్రం... రెండు గంటల పాటు రాష్ట్రపతి పాలనను ఎత్తివేసేందుకు ఒప్పుకోక తప్పలేదు. ఈ క్రమంలో నేటి ఉదయం 11 గంటలకు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తాత్కాలికంగా రద్దైంది. అయితే బల పరీక్ష ముగిసి అధికార, విపక్షాలు బయటకు వచ్చిన తర్వాత సరిగ్గా మధ్యాహ్నం 1 గంటకు తిరిగి ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. బల పరీక్షలో హరీశ్ రావత్ సర్కారు నెగ్గిన విషయాన్ని రేపు సుప్రీంకోర్టు అధికారికంగా ప్రకటించనుంది. ఆ తర్వాత ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన పూర్తిగా తొలగిపోనుంది.

  • Loading...

More Telugu News