: స్నేక్ గ్యాంగ్ ముఠాలో 8 మంది దోషులు!.... నిర్దోషిగా బయటపడ్డ సలాం హందీ!
హైదరాబాదు పాత బస్తీలో కలకలం రేపిన స్నేక్ గ్యాంగ్ అకృత్యాలపై రంగారెడ్డి జిల్లా కోర్టు కొద్దిసేపటి క్రితం సంచలన తీర్పు ఇచ్చింది. స్నేక్ గ్యాంగ్ లోని 9 మంది సభ్యుల్లో 8 మందిని దోషులుగా ప్రకటించిన కోర్టు... ఏ9గా ఉన్న సలాం హందీ అనే వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది. 2014లో పాములు చేతబట్టిన స్నేక్ గ్యాంగ్ హల్ చల్ చేసింది. ఏకాంతం కోసం నిర్జన ప్రదేశాలకు వెళ్లే ప్రేమ జంటలే లక్ష్యంగా స్వైర విహారం చేసిన ఈ గ్యాంగ్ దాదాపు 37 జంటలపై దాడులకు దిగింది. ముఠాలోని ఓ సభ్యుడు పాముతో యువ జంటను బెదిరిస్తే... మిగిలిన సభ్యులు జంటలోని ప్రియుడికి చితకబాదేవారు. ఆ తర్వాత గ్యాంగ్ లీడర్ జంటలోని యువతిపై అత్యాచారం చేసేవాడు. ఆ తర్వాత మిగిలిన సభ్యులు కూడా యువతిపై దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడేవారు. ఈ ఘటనను సెల్ ఫోన్ చిత్రీకరించిన ఈ ముఠా... బయట నోరు విప్పితే వీడయో నెట్ లో కొచ్చేస్తుందని బెదిరించేవారు. దీంతో వీరి బారిన పడిన జంటలు పంటి బిగువునే దారుణాన్ని దిగమింగారు. అయితే ఓ జంటలోని యువతి మాత్రం ధైర్యం చేసి 2014 జూలై 31న పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేసి సమగ్ర సాక్ష్యాలతో చార్జిషీటు దాఖలు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి మొత్తం 21 మంది సాక్షులను విచారించిన కోర్టు... కొద్దిసేపటి క్రితం తీర్పు చెప్పింది. 8 మందిని దోషులుగా పేర్కొన్న కోర్టు... సలాం హందీని మాత్రం నిర్దోషిగా ప్రకటించింది. ఇక దోషులుగా తేలిన వారికి శిక్షలను రేపు ఖరారు చేయనున్నట్లు కోర్టు వెల్లడించింది.