: 'కృత్రిమ మేధస్సు'పై ఇన్ఫోసిస్ కన్ను... సూపర్ కోడర్స్ కోసం సిలికాన్ వ్యాలీలో వేట!


తదుపరి తరం ప్రపంచాన్ని ఏలేది కృత్రిమ మేధస్సే (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ - ఏఐ) అని నమ్ముతున్న భారత రెండవ అతిపెద్ద సాఫ్ట్ వేర్ ఎగుమతుల సంస్థ, ఈ దిశగా సత్తా చాటేందుకు భారీ ప్రణాళికలు వేస్తోంది. ఏఐ విభాగంలో నూతన ఉత్పత్తుల సృష్టి కోసం 'మన' పేరిట కొత్త ప్లాట్ ఫాంను ప్రారంభించిన సంస్థ, వివిధ రకాల ప్రొడక్టుల అభివృద్ధి కోసం, ప్రపంచంలోని అతిపెద్ద టెక్ హబ్ గా పేరున్న సిలికాన్ వ్యాలీపై కన్నేసింది. ప్రత్యేక 'సూపర్ కోడర్స్' టీమును అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నామని, ఎక్స్ పర్ట్ ట్రాక్ ప్రోగ్రామ్ ద్వారా ఏఐ విభాగంలో ముందడుగు వేస్తామని సంస్థ ఆర్కిటెక్చర్ అండ్ టెక్నాలజీ విభాగం హెడ్ నవీన్ బుధిరాజా వెల్లడించారు. ఇప్పుడున్న సూపర్ కోడర్స్ టీమును రెట్టింపు చేయాలన్న ఆలోచనలో ఉన్నామని, సంప్రదాయ ఔట్ సోర్సింగ్ వ్యాపారంలో అవకాశాలు తగ్గుతున్న వేళ, భవిష్యత్ ఆదాయ వృద్ధి కోసం పలు మార్గాలను అన్వేషిస్తున్నామని ఆయన తెలిపారు. కాగా, ఇన్ఫోసిస్ లో క్లౌడ్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారాన్ని పర్యవేక్షిస్తున్న శాంసన్ డేవిడ్ కు 'ఎక్స్ పర్ట్ సర్వీస్ టీమ్' బాధ్యతలను కూడా అప్పగించినట్టు తెలుస్తోంది. ఈ టీమ్ 'మన' వంటి టెక్నాలజీ ప్లాట్ ఫాంలను అభివృద్ధి చేస్తుందని, ఆటోమేషన్ విధానంలో విప్లవాత్మక మార్పులను తాము పరిచయం చేస్తామని బుధిరాజా వెల్లడించారు. భవిష్యత్తులో టెక్ రంగానికి ఉపయోగపడేలా ప్రొడక్టుల కోసం మరింత మంది నిపుణులను విధుల్లోకి తీసుకోనున్నామని పేర్కోన్నారు. తమ ఏఐ ప్రొడక్టుల తయారీ, వాటి పనితీరు పరిశీలన తరువాత, మూడవ లేయర్ లో అకౌంట్స్ టీమ్, ఆపై సేల్స్ టీముల పని ప్రారంభమవుతుందని తెలిపారు. ఇవన్నీ కంపెనీల రోజువారీ పనిని మరింత యాంత్రీకరణ చేసేందుకు సహకరిస్తాయని తెలిపారు.

  • Loading...

More Telugu News