: విద్యార్థులకు 'ఆవు లేఖ'... హిందుత్వమే అజెండాగా వసుంధర సర్కారు తీరు!


రాజస్థాన్ లో తమ హిందుత్వ అజెండాను ప్రజల్లోకి, ముఖ్యంగా విద్యార్థుల్లోకి మరింతగా చొప్పించాలన్న యత్నాల్లో భాగంగా వసుంధరా రాజే నేతృత్వంలోని బీజేపీ సర్కారు చేస్తున్న పనులు వివాదాస్పదమవుతున్నాయి. ఇండియాలో కేవలం ఆవుల కోసమే అంకితమైన ఓ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఉన్న రాజస్థాన్ లో ఐదవ తరగతి విద్యార్థులకు ఈ సంవత్సరం నుంచి మారిన పుస్తకంలో 'ఆవు లేఖ' పేరిట పాఠం రూపొందించారు. ఆవు పెద్ద చిత్రాన్ని ప్రచురించి, దాని వివిధ శరీర భాగాలపై హిందూ దేవతల చిత్రాలను చూపుతూ, ఓ లేఖ రూపంలో పాఠం ఉంది. తనను తల్లిగా అభివర్ణించుకుంటూ, ఆవు రాసిన ఈ లేఖలో "నా పుత్రులు, పుత్రికలకు..." అంటూ, తనను అమ్మగా భావించాలని, విద్యార్థులకు తెలివితేటలను, వ్యక్తిగత బలాన్ని, దీర్ఘాయువును, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తానని చెప్పుకుంది. పాలు, వెన్న, నెయ్యి తదితరాలను అందిస్తానని, తన మూత్రాన్ని ఔషధాలు, ఎరువులు, రసాయనాల్లో వాడుతారని, పురుష ఆవులు (ఎద్దులు) వ్యవసాయంలో సహకరిస్తాయని, తన శ్వాస ద్వారా పర్యావరణాన్ని శుభ్రం చేస్తానని ఆవు చెప్పుకుంది. పుస్తకంలో ఈ చాప్టర్ ను జోడించడాన్ని రాజస్థాన్ ఆవుల పరిరక్షణ శాఖ మంత్రి ఓతారామ్ దేవాసి సమర్థించుకున్నారు. ఆవు ఉపయోగాలను పిల్లలకు చెప్పడానికే దీన్ని జోడించామని, పరీక్షల్లో ప్రశ్నలు ఉండవని తెలిపారు.

  • Loading...

More Telugu News