: భగ్గుమన్న అమరావతి కార్మికులు... అంబులెన్స్ కు నిప్పు, ఎల్ అండ్ టీ ఆఫీస్ పై రాళ్ల వర్షం
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో కొనసాగుతున్న తాత్కాలిక సచివాలయం నిర్మాణంలో నిన్న రాత్రి చోటుచేసుకున్న ప్రమాదంపై కార్మికులు భగ్గుమన్నారు. ప్రమాదవశాత్తు కాంక్రీట్ మిల్లర్ లో పడ్డ ఉత్తరప్రదేశ్ కు చెందిన కార్మికుడు దేవేందర్ చనిపోయాడు. రెండు రోజుల క్రితమే పనికి కుదిరిన దేవేందర్ మృత్యువాత అక్కడి కార్మికులను తీవ్ర ఆవేదనలోకి నెట్టేసింది. గతంలో జరిగిన ఓ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఘటన చోటుచేసుకోవడంతో కార్మికులు భగ్గుమన్నారు. శరవేగంగా సాగుతున్న తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనుల్లో ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు చోటుచేసుకున్నాయని కార్మికులు ఆందోళనకు దిగారు. దేవేందర్ మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు యత్నించగా కార్మికులు అడ్డుకున్నారు. దేవేందర్ కుటుంబానికి న్యాయం చేసిన తర్వాతే మృతదేహాన్ని తరలించేందుకు అంగీకరిస్తామని భీష్మించారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన అంబులెన్స్ కు వారు నిప్పుపెట్టారు. కార్మికుల ఆందోళనతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అంబులెన్స్ పై విరుచుకుపడ్డ కార్మికులు అంతటితో ఆగలేదు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో నిర్మాణ పనులు చేస్తున్న ఎల్ అండ్ టీ కార్యాలయంపై రాళ్లతో దాడికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడ మోహరించారు. ఓ వైపు కార్మికుల ఆందోళన, మరోవైపు భారీ సంఖ్యలో పోలీసుల మోహరింపుతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.