: 2016లో వెలుగులోకి వచ్చిన అతిపెద్ద కుంభకోణం... ఏఐ కాంట్రాక్టు కోసం కేంద్ర మంత్రి, అధికారులకు కోట్ల ఆఫర్!


ఇది ఈ సంవత్సరం వెలుగులోకి వచ్చిన కుంభకోణాల్లో అతిపెద్దది. విమానాశ్రయాల్లో సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేసే దిశగా బయోమెట్రిక్ ఫేసియల్ రికగ్నిషన్ మిషన్లు కొనుగోలు చేయాలని ఎయిర్ ఇండియా భావించగా, ఆ కాంట్రాక్టును దక్కించుకోవడం కోసం ఓ కెనడా సంస్థ కోట్ల రూపాయలను మంత్రులకు, అధికారులకు ముట్టజెప్పినట్టు జీ మీడియా కార్పొరేషన్ సంచలన కథనాన్ని ప్రసారం చేసింది. ఈ టెండర్ల ఘటన జరిగిన 10 సంవత్సరాల తరువాత ఆనాడు జరిగిన కుంభకోణం వివరాలు వెలుగులోకి రావడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే, ఫిబ్రవరి 24, 2006లో అత్యాధునిక యంత్రాల కోసం ఎయిర్ ఇండియా ప్రతిపాదనలు కోరింది. మొత్తం 20 కంపెనీలకు ప్రతిపాదనలు పంపాలని రిక్వెస్ట్ పెట్టగా, వాటిల్లో కెనడాకు చెందిన క్రిప్టోమెట్రిక్స్ కూడా ఉంది. అంతకు ముందే కాంట్రాక్టులు ఇస్తారన్న విషయాన్ని తెలుసుకుని, దీన్ని ఎలాగైనా దక్కించుకోవాలని భావించిన , క్రిప్టోమెట్రిక్స్ కెనడాలో నివసిస్తున్న ఎన్నారై నాజిర్ కారిగర్ సహాయాన్ని కోరింది. ఆయన మధ్యవర్తిగా ఎయిర్ ఇండియాలోని అధికారులకు లంచాలిచ్చింది. ప్రతిపాదనలు పంపాలని రిక్వెస్ట్ చేయడానికి రెండు నెలల ముందే, 2005 డిసెంబరులో టెండర్లకు సంబంధించిన కాపీ నాజిర్ చేతుల్లోకి చేరిందని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇండియాలోని అధికారులకు లంచాలిచ్చేందుకు , క్రిప్టోమెట్రిక్స్, ముంబైలోని నాజిర్ ఖాతాకు 4. లక్షల డాలర్లను (సుమారు రూ. 3 కోట్లు) బదిలీ చేసింది. ఈ డీల్ తమకు లభిస్తే, అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్ కు 40 లక్షల డాలర్లను (సుమారు రూ. 26. కోట్లు) ఇచ్చేందుకు కూడా డీల్ కుదిరినట్టు జీ మీడియా వెల్లడించింది. టెండర్లు ముందుకు కదిలేకొద్దీ ఈ డబ్బును దశలవారీగా అధికారులకు, కేంద్ర మంత్రికి అప్పగించాలన్నది , క్రిప్టోమెట్రిక్స్ నిర్ణయం. అప్పట్లో ఈ కాంట్రాక్టును ఎవరికీ ప్రకటించనప్పటికీ, ఈ డీల్ కు సంబంధించిన ఎన్నో దస్త్రాలను తాము సేకరించామని జీ మీడియా పేర్కొంది. ఈ విషయంలో పేపర్లలో పేర్లు ఉన్నంత మాత్రాన ఎవరూ నిందితులు కాదని చెబుతూనే పలు అనుమానాలను వ్యక్తం చేసింది. తమ వద్ద ఉన్న దస్త్రాల్లోని పలు వివరాలను అందించింది. * నాజిర్ ఇండియాలో ప్రఫుల్ పటేల్ ను కలిశారా? * మొత్తం రూ. 698 కోట్ల డీల్ లో 30 శాతం వాటాను నాజిర్ ద్వారా పటేల్, ఎయిర్ ఇండియా అధికారులకు ఇవ్వాలన్నది క్రిప్టోమెట్రిక్స్ యోచన. నాజిర్ ఖాతాకు మళ్లించిన చబ్బు టెండర్ ప్రాసెస్ లో క్రిప్టోమెట్రిక్స్ ను సెలక్ట్ చేసేందుకే. * క్రిప్టోమెట్రిక్స్ వైస్ ప్రెసిడెంట్ రాబర్ట్ బెల్, నాజిర్ ల మధ్య ఎన్నో ఈ-మెయిల్స్ నడిచాయి. * అప్పటి ఈ డీల్ లో ఎయిర్ ఇండియా సెక్యూరిటీ డైరెక్టర్, ఆపై ముంబై పోలీసు కమిషనర్ గాపనిచేసిన హసన్ గఫూర్ పేరు కూడా ఉంది. * ఎయిర్ ఇండియా సీఎండీ వాసుదేవన్ తులసీదాస్ పేరు కూడా దస్త్రాల్లో ఉంది. * ఎయిర్ ఇండియా డిప్యూటీ డైరెక్టర్ కెప్టెన్ మస్కరెన్హాస్ పేరు కూడా ఉంది. * ఇదే విషయమై ఒంటారియోలో కేసు నడువగా, నాజిర్ కారిగర్, ఎయిర్ ఇండియా అధికారులకు లంచాలు ఇచ్చాడని నిరూపితమైంది. * విచారణలో ప్రఫుల్ పటేల్ పేరు వచ్చినప్పటికీ, ఆయనకు లంచం డబ్బు అందిందా? అన్న విషయమై స్పష్టత లేదు. * నాజిర్ కోరికపై క్రిప్టోమెట్రిక్స్ సంస్థ ఇండియాలో తమ అనుబంధ కంపెనీగా క్రిప్టోమెట్రిక్స్ ఇండియాను ఏర్పాటు చేసింది. * ఈ కాంట్రాక్టు కోసం ఆగస్టు 3, 2006న క్రిప్టోమెట్రిక్స్ ను షార్ట్ లిస్ట్ చేసిన కంపెనీల జాబితాలో ఉంచారు. * ఆపై సెప్టెంబర్ 12న, తొలుత ప్రకటించిన 20 కంపెనీల నుంచి క్రిప్టోమెట్రిక్స్ తో పాటు ఐపీకాన్ లను మాత్రమే తుది జాబితాలో ఉంచుతున్నట్టు టెండర్ కమిటీ ప్రకటించింది. * ఆపై కొన్ని కారణాల వల్ల టెండర్లను రద్దు చేసినట్టు ప్రకటించింది. ఇదిలావుండగా, తనపై వచ్చిన ఆరోపణలను పటేల్ తోసిపుచ్చారు. ఇవన్నీ నిరాధారమైనవని తెలిపారు. ఆ టెండర్ల అంశం ఎయిర్ ఇండియా వ్యక్తిగతమని, తన శాఖ ఎటువంటి టెండర్ ఫైల్స్ లో వేలు పెట్టలేదని అన్నారు.

  • Loading...

More Telugu News