: విడుదల చేయాలా?... వద్దా?: ఎంసెట్ ఫలితాలపై నలుగురు మంత్రులు, 4 గంటల పాటు మల్లగుల్లాలు


నిజమే. నిన్న నలుగురు కేబినెట్ మంత్రులు సాగర నగరం విశాఖలో నాలుగు గంటల పాటు చర్చోపచర్చలు చేశారు. నీట్ పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎంసెట్ ఫలితాలపై ఏ విధంగా ప్రభావం చూపనుందన్న అంశంపై నాలుగు గంటల పాటు దఫదఫాలుగా చర్చించిన మంత్రులు... చివరకు సమస్య ఎదురవుతుందని భావించిన మెడిసిన్ విభాగం ఫలితాలను వదిలేసి ఇంజినీరింగ్ విభాగం రిజల్ట్స్ ను విడుదల చేసేందుకు నిర్ణయించారు. వెరసి నిన్న ఇక విడుదల కావులే అనుకున్న ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు రాత్రి విడుదలయ్యాయి. ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు... సహచర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కింజరాపు అచ్చెన్నాయుడు, కామినేని శ్రీనివాస్ లతో పలు దఫాలుగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలితాల విడుదలకు సమాయత్తమైన గంటా... సహచర మంత్రులతో కలిసి ఆంధ్రా యూనివర్సిటీకి చేరుకున్నారు. అయితే ఈ లోగా నీట్ పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. సాయంత్రం 5 గంటల తర్వాత సదరు తీర్పు నెట్ లో అప్ లోడ్ కానుందన్న సమాచారం అందింది. తీర్పు కాపీ చదివిన తర్వాత కాని ఫలితాల విడుదలపై తుది నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. ఈ క్రమంలో తీర్పు కాపీ నెట్ లో అప్ లోడ్ అయ్యేసరికే రాత్రి 7.30 గంటలైంది. నిర్దేశించుకున్న సమయానికి రెండున్నర గంటల ఆలస్యంగా తీర్పు కాపీ అందుబాటులోకి రావడంతో ఒకానొక దశలో ఫలితాల వెల్లడిని వాయిదా వేయాలని గంటా భావించారు. అయితే కోర్టు తీర్పు కాపీ రాగానే దానిని చూసిన గంటా... మెడిసిన్ కు నీట్ తప్ప వేరే పరీక్ష వద్దని, ఇది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందన్న కోర్టు నిర్ణయాన్ని సీఎం చంద్రబాబుకు వివరించారు. ఈ నేపథ్యంలో మెడిసిన్ రిజల్ట్స్ ను వదిలేసి, ఇంజినీరింగ్ ఫలితాలను విడుదల చేయమని చంద్రబాబు సూచించారు. దీంతో రాత్రి 8 గంటలు దాటిన తర్వాత మళ్లీ ఏయూ కేంపస్ చేరుకున్న మంత్రుల బృందం ఇంజినీరింగ్ ఫలితాలను విడుదల చేసింది. ఈ క్రమంలో దాదాపు నాలుగు గంటల పాటు హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.

  • Loading...

More Telugu News