: పుట్టింది ఇటలీలోనే అయినా... చచ్చేది మాత్రం ఇక్కడే!: సోనియా గాంధీ ఉద్వేగం
కేంద్రంలోని బీజేపీ సర్కారు తనపై చేస్తున్న దాడిని తిప్పికొట్టే క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నిన్న ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న ఆ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరైన సందర్భంగా సోనియా గాంధీ చేసిన ప్రసంగం ఉద్వేగభరితంగా సాగింది. ఇటలీలోనే పుట్టిన తాను తుది శ్వాస విడిచేది మాత్రం ఇక్కడేనని ఆమె ప్రకటించారు. తన అస్థికలు కలిసేది కూడా ఇక్కడి నీటిలోనేనని ఆమె పేర్కొన్నారు. ‘‘అవును. నేను ఇటలీలో పుట్టానని చెప్పుకోవడానికి సిగ్గుపడను. 90 ఏళ్ల నా తల్లి అక్కడే ఉందని చెప్పడానికి సంకోచించను. ఇందిరా గాంధీ కోడలిగా మారిన తర్వాత గడచిన 48 ఏళ్ల నుంచి నేను ఇక్కడే ఉంటున్నా. ఇదే నా ఇల్లు. ఇదే నా దేశం. నా చావు ఇక్కడే. నా అస్థికలు కలిసేది ఈ నీటిలోనే’’ అని ఆమె వ్యాఖ్యానించారు. తన జాతీయతను ప్రధాని నరేంద్ర మోదీ కానీ, బీజేపీ సిద్ధాంతకర్త ఆరెస్సెస్ కానీ అర్థం చేసుకోలేరని, వారు అర్థం చేసుకుంటారని కూడా తాను భావించడం లేదని కూడా సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.