: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్!... రామాలయం వాచ్ మన్ కు అందిన రూ.5 లక్షల చెక్కు!
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో అలుపెరగని యోధుడిగా ఫలితం సాధించిన టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో దూసుకెళుతున్నారు. ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటికే కార్యరూపంలోకి తెచ్చేసిన కేసీఆర్... సీఎం హోదాలో పలువురు వ్యక్తులకు ఇచ్చిన మాటలను కూడా నిలబెట్టుకుంటున్నారు. అసలు విషయమేంటంటే... రామాలయంలో వాచ్ మన్ గా పనిచేస్తున్న షేక్ మస్తాన్ అనే వ్యక్తికి ఆర్థిక సాయంపై ఇచ్చిన హామీని సీఎంఓ అధికారులు నిన్న అమలు చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ముత్తారం గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని ఫిబ్రవరి 16న కేసీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ వాచ్ మన్ గా పనిచేస్తున్న షేక్ మస్తాన్ అనే వ్యక్తి తన గోడును వెళ్లబోసుకున్నాడు. తన మనవరాలు షేక్ సహారీ బేగం దుస్థితిని కేసీఆర్ కు వివరించారు. మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆమె... తండ్రి చనిపోవడంతో తన వద్దే ఉంటోందని, ఆమెకు వైద్యం చేయించే స్తోమత లేదని తెలిపాడు. మస్తాన్ ధీన గాథకు చలించిపోయిన కేసీఆర్ సాయం చేస్తానని మాట ఇచ్చారు. ఆ తర్వాత కేసీఆర్ ఆదేశాలతో బాలిక వైద్య ఖర్చులపై ఆరా తీశారు. బాలిక వైద్య ఖర్చులు రూ.5 లక్షల మేర అవుతాయని తేలింది. ఇదే విషయాన్ని కేసీఆర్ కు నివేదించిన అధికారులు... ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సదరు మొత్తానికి చెందిన చెక్కును నిన్న ముత్తారం వెళ్లి షేక్ మస్తాన్ కు అందజేశారు.