: ఉద్యోగ వేటలో ఓడిన తెలంగాణ చదువుల తల్లి!... సీఎం కేసీఆర్ కు సూసైడ్ లేఖ రాసి బలవన్మరణం


ఉద్యోగ వేటలో ఆ చదువుల తల్లి ఓడిపోయింది. ఫలితంగా ఆ విద్యార్థిని అర్థాంతరంగా జీవితాన్ని ముగించింది. అసలు తాను ఉద్యోగ వేటలో ఎందుకు విఫలమవుతున్నానన్న విషయాన్ని కూడా ఆ విద్యార్థిని తెలుసుకుంది. కారణం తనది కాదు. ప్రభుత్వానిది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న విద్యా శాఖాధికారిది. మరి ఏం చేయాలి? ప్రభుత్వాధినేతకు విషయాన్ని చెప్పి తనువు చాలించాలనుకుంది. వెంటనే ఉద్యోగ వేటలో తాను ఎందుకు ఓడిపోతున్నానన్న విషయాన్ని స్వదస్తూరితో ప్రభుత్వాధినేతకు లేఖ రాసింది. ఆ తర్వాత ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్స పొందుతూ తనువు చాలించింది. ఈ హృదయ విదారక ఘటన తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.... నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన లక్ష్మయ్య, యాదమ్మల ఏకైక కుమార్తె ప్రమీల (25) బీఈడీ పూర్తి చేసి ఆ తర్వాత ఎంఎస్సీ కూడా చదివింది. ఈ క్రమంలో ఉద్యోగ వేటలో భాగంగా పలుమార్లు టెట్ రాసింది. అయితే టెట్ లో ఆమె పాస్ కాలేకపోయింది. బయలాజికల్ సైన్స్ నేపథ్యంలో ఎంఎస్సీ పూర్తి చేసిన ఆమె... టెట్ లో ఎదురైన మ్యాథ్స్ ప్రశ్నలకు జవాబివ్వలేకపోయింది. టెన్త్ వరకే మ్యాధ్స్ తో పరిచయం ఉన్న ఆమె... ఆ తర్వాత తన విద్యాభ్యాసంలో మ్యాథ్స్ ముఖమే చూడలేదు. ఈ కారణంగానే టెట్ లో ఆమె రాణించలేకపోయింది. తనలాగే బయలాజికల్ సైన్సెస్ నేపథ్యం ఉన్న చాలా మంది విద్యార్థులు టెట్ గట్టెక్కలేకపోతున్నారని ఆమె వాపోయింది. అప్పటికే తండ్రి తనువు చాలించగా, కుట్టు మిషన్ పై తల్లి కష్టపడి పనిచేసి తనను చదివించిన తీరు కళ్లారా చూస్తూ పెరిగిన ప్రమీల... తల్లికి చేదోడువాదోడుగా నిలవలేనన్న భావనతో ఆత్మహత్యాయత్నం చేసింది. అంతకుముందు టెట్ లో తాను ఎదుర్కొన్న విపత్కర పరిస్థితిని తన సూసైడ్ లేఖలో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సమగ్రంగా వివరించింది. గత శుక్రవారం తన సొంతింటిలోనే సూపర్ వ్యాస్మాల్ 33 కేశ్ కాలా తాగింది. విషయాన్ని గ్రహించిన ఆమె తల్లి హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా... హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో నిన్న తనువు చాలించింది. కేసీఆర్ కు ప్రమీల రాసిన లేఖ కలకలం రేపుతోంది. ఆ లేఖ పూర్తి పాఠం కింది విధంగా ఉంది. శ్రీయుత గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి నమస్కరించి రాయునది ఏమనగా ! ఆర్యా ! నేను కె. ప్రమీల డాటర్ ఆఫ్ లక్ష్మయ్య. నాలాంటి ఎంతో మంది విద్యార్థుల మనస్సులో ఉన్న ఈ మాటని నేను మీకు చెప్పాలనుకుంటున్నా.. నేను ప్రస్తుతం ఎంఎస్సీ చేస్తున్నా. బీఈడీ కూడా అయిపోయి టెట్ కోసం చదువుతున్నా. నాది బీఈడీలో బయో సైన్స్ సబ్జెక్ట్. మాకు టెట్‌లో 30 మార్కులు మ్యాథ్స్ పెట్టడం వల్ల ఎక్కువ మార్కులు తెచ్చుకోలేకపోతున్నాం. మాకు టెన్త్ వరకే మ్యాథ్స్ ఉంటుంది. తర్వాత ఎక్కడా మ్యాథ్స్ లేదు. టెట్‌లో మ్యాథ్స్ పెట్టడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మ్యాథ్స్ ఉండటం వల్ల బయో సైన్స్ విద్యార్థులు ఎక్కువ మార్కులు తెచ్చుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. మ్యాథ్స్ తీసివేయాలని కోరుకుంటున్నాం. నాకు ఉపయోగపడకపోయినా నా తోటి విద్యార్థులకు ఉపయోగపడుతుంది. మ్యాథ్స్‌కు బదులు టెట్‌లో మెంటల్ ఎబిలిటి పెట్టమని కోరుతున్నా. ఇదే నా చివరి కోరికగా భావించి దీన్ని అమలు చేయాల్సిందిగా కోరుతున్నా. ఇట్లు తమ తెలంగాణ బిడ్డ ప్రమీల.

  • Loading...

More Telugu News