: ఎంసెట్ మెడిసిన్ పై ప్రకటన చేస్తాం...నీట్ తీర్పు అధ్యయనం చేస్తున్నాం: కామినేని
సుప్రీంకోర్టు తీర్పులో వైద్యవిద్య ప్రవేశాలకు రాష్ట్రాలకు ప్రత్యేకంగా ప్రైవేటు పరీక్ష నిర్వహించే హక్కు లేదని స్పష్టం చేసిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పులో కొంత అస్పష్టత ఉందని ఆయన వివరించారు. దీనిపై అధ్యయనం చేసిన తరువాత ఓ నిర్ణయం తీసుకుంటామని అన్నారు. రాష్ట్రాలకు ప్రవేశ పరీక్ష నిర్వహించే హక్కులేదని సుప్రీం చెప్పిందని, ఇకపై పరీక్ష నిర్వహించనున్న రాష్ట్రాలకు అది వర్తిస్తుందని, మరి ఇప్పటికే పరీక్ష నిర్వహించిన ఏపీ పరిస్థితి ఏంటనేది నిపుణులతో చర్చిస్తున్నామని ఆయన వివరించారు. నీట్ 2 రాయడానికి విద్యార్థులకు అవకాశం కల్పించడం గురించి ఆలోచిస్తున్నామని ఆయన తెలిపారు. నీట్ తీర్పుపై సమగ్ర అధ్యయనం చేసిన తరువాత భవిష్యత్ ప్రణాళిక ఏంటనేది ప్రకటిస్తామని ఆయన చెప్పారు.