: నేను పార్టీ మారట్లేదు.. టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది: ఎమ్మెల్యే సండ్ర
తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలను సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఖండించారు. పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ గందరగోళం సృష్టించేందుకే ఇటువంటి వార్తలను ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ‘నాకు పార్టీ మారే ఆలోచన, అవసరం లేవు. నమస్తే తెలంగాణ పత్రికలో కూడా ఈరోజు నా గురించి ఇటువంటి వార్తేదో వచ్చినట్లు తెలిసింది. ఇటువంటి వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో నిబద్ధత కల్గిన ఒక నాయకుడిలాగా పనిచేస్తున్నాము. మాపై ఎన్ని ఒత్తిళ్లు, ఒడిదుడుకులున్నప్పటికీ కూడా ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నాము. పాలేరు ఉపఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకత్వం సృష్టిస్తున్న ఇటువంటి వార్తలను నమ్మవద్దని టీడీపీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాను’ అని సండ్ర వెంకట వీరయ్య అన్నారు.