: మాజీ క్రికెటర్ అజహర్ కు కోపం తెప్పిస్తున్న ప్రశ్న!
మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ కి చిర్రెత్తించే ప్రశ్నను విలేకరులు తరచుగా అడుగుతుండటంతో ఆయన అలిగి అర్థాంతరంగా వెళ్లిపోతున్నారట. ఇంతకీ, ఆ ప్రశ్న ఏమిటి? ఎవరు అడుగుతున్నారు? ఎక్కడ అడుగుతున్నారనే ప్రశ్నలకు సమాధానం... అజహర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రం ఈ నెల 13వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమం నిమిత్తం చిత్ర బృందంతో పాటు అజహర్ కూడా పాల్గొంటున్నారు. ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటున్న విలేకరులు తరచుగా ‘మ్యాచ్ ఫిక్సింగ్ లో మీరు డబ్బు తీసుకున్నారా? లేదా?’ అని అజహర్ ను అడుగుతున్నారు. ఈ ప్రశ్నతో చికాకు, కోపానికి గురవుతున్న అజహర్ అర్థాంతరంగా ఆయా కార్యక్రమాల నుంచి వెళ్లిపోతున్నాడు. అయితే, అలా వెళ్లవద్దని, లాజిక్ గా సమాధానం చెప్పి తప్పించుకోమని ఆ చిత్ర యూనిట్ ఆయనకు చెప్పినప్పటికీ అజహర్ పట్టించుకోవట్లేదట. విలేకరులు ఆ ప్రశ్న లేవనెత్తినప్పుడు ‘ఈ సినిమా చూస్తే ఆ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది’ అని చెప్పమని అజహర్ కు చిత్ర యూనిట్ చెప్పిందని సమాచారం. ఈ ప్రశ్న అడుగుతారేమోనని అనుమానంతో ఒక ప్రముఖ ఛానెల్ ఏర్పాటు చేసిన ప్రత్యేక షో కి అజహర్ హాజరుకాలేదని బాలీవుడ్ వర్గాల సమాచారం.