: విచారణకు రాలేను!... సీబీఐకి తేల్చిచెప్పిన హరీశ్ రావత్
అటు సుప్రీంకోర్టులోనే కాకుండా ఇటు హైకోర్టులోనూ ప్రత్యర్థులకు ఎదురుదెబ్బలు తగిలిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కాస్తంత ధైర్యం చేసినట్లే కనిపిస్తున్నారు. తనకు 9 మంది సొంత పార్టీ ఎమ్మెల్యేలు హ్యాండిచ్చిన నేపథ్యంలో విపక్ష బీజేపీకి చెందిన ఎమ్మెల్యేల ఓట్లు సాధించేందుకు రంగంలోకి దిగిన రావత్ ... స్టింగ్ ఆపరేషన్ కు అడ్డంగా దొరికిపోయారు. ఉత్తరాఖండ్ లో రాజకీయ సంక్షోభానికి ముందే ఓ సీడీ బయటకు రాగా, తాజాగా మరో సీడీ నిన్న వెలుగుచూసింది. దీనిపై రంగంలోకి దిగిన సీబీఐ... విచారణకు హాజరుకావాలని రావత్ కు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై నేటి ఉదయం స్పందించిన రావత్... విచారణకు హాజరుకాలేనని సీబీఐకి తేల్చిచెప్పారు. రేపు అసెంబ్లీలో బలపరీక్ష ఉన్న నేపథ్యంలో ఆయన చేసిన ప్రకటనపై సీబీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.