: ముందు మోదీ సర్కారు అడిగితే... ఆపై నా సమాధానం చెబుతా: రఘురాం రాజన్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరుగా రఘురాం రాజన్ కాలపరిమితి మరో నాలుగు నెలల్లో పూర్తి కానున్న నేపథ్యంలో, ఆయనకు మరో చాన్స్ లభిస్తుందా? అన్న విషయమై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆర్బీఐకి మరో విడత గవర్నరుగా పనిచేసే అవకాశాన్ని మోదీ సర్కారు రాజన్ కు ఇస్తుందా? అన్న విషయంలో అటు ప్రభుత్వ వర్గాల నుంచి, ఇటు ఆర్బీఐ నుంచి ఎలాంటి అధికారిక సమాచారమూ లేదు. ఇక ఇదే ప్రశ్నను రాజన్ ముందుంచితే, "ఆ ప్రశ్నకు నేను సమాధానం ఇవ్వలేను. ముందు ప్రభుత్వం నన్ను అడగాలి. మీరు మరో విడత కొనసాగుతారా? అన్న ప్రశ్న ఎదురైన వేళ, నేను సమాధానం చెబుతాను" అని రాజన్ వ్యాఖ్యానించారు. అయితే, రాజన్ మరో విడత కొనసాగాలని మనస్ఫూర్తిగా భావిస్తే మాత్రం కేంద్ర ప్రభుత్వం కాదనే అవకాశాలు దాదాపు లేనట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలావుండగా, తదుపరి ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి) అధ్యక్షపదవి రాజన్ ను వరిస్తుందన్న ఊహాగానాలు వస్తున్న వేళ, ఐఎంఎఫ్ కు సేవలందించే అవకాశం లభిస్తే, ఆయన ఆ దిశగానే పయనించవచ్చని అంచనా.