: అవమానం...ఎగతాళి... అయినా పట్టువీడలేదు.. 'గంగ'ను తెచ్చాడు!
భార్యను బతికించుకోలేకపోయాననే బాధతో బీహార్ కు చెందిన దళితుడు దశరథ్ మాంఝీ (మౌంటెన్ మ్యాన్) ఒంటరిగా పెద్ద కొండను తవ్వి గ్రామానికి రహదారి వేసిన సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలోని కలంబేశ్వర్ కు చెందిన బాబూరావు తాంజే కూడా అలాంటి గొప్పపని చేసి వార్తల్లో వ్యక్తి అయ్యారు. బాబూరావు తాంజే రోజు కూలీగా పని చేస్తాడు. రెండు నెలల క్రితం తన భార్య దగ్గర్లోని బావికి తాగునీటి కోసం వెళ్లింది. ఆ బావి యజమాని ఆమెను దుర్భాషలాడాడు. దారుణంగా అవమానించాడు. దీంతో ఆమె ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు జరిగింది వివరించి, కుమిలిపోయింది. అంతా విన్న బాబూరావు తాంజే దళితుడైన తాను ఏం చేయగలనని ఆలోచించాడు. కర్తవ్యం గుర్తుకువచ్చిన వ్యక్తిలా మాలెగావ్ కు వెళ్లి పలుగు, పార కొనుక్కుని వచ్చి, దేవుడికి దండం పెట్టి బావి తవ్వడం మొదలు పెట్టాడు. ఓపక్క రోజువారీ కూలి చేసుకుంటూ, మరోపక్క రోజూ నాలుగు గంటల పాటు బావి తవ్వడం మొదలు పెట్టాడు. ఆ సందర్భంగా ఆయనను అంతా నిరాశకు గురి చేసినవారే. మొన్నే ఇక్కడ రెండు బోర్లు వేస్తే నీరు పడలేదు. నువ్వు తవ్వితే నీరు పడుతుందా? అని అంతా ఎద్దేవా చేశారు. అయినా సరే బాబూరావు నిరాశ చెందకుండా తవ్వాడు. 40 రోజులు అలా తవ్విన తరువాత ఆయన తవ్విన బావిలో నీరు పడింది. ఇప్పుడు ఆ ప్రాంతంలోని దళితులంతా ఆ నీటినే వాడుతున్నారు. ఆయన చేసిన పని ఆ నోటా ఈ నోటా మీడియాకు చేరడంతో ఆయనను అంతా అభినందిస్తున్నారు.