: మొబైల్ లేకపోయినా వాట్సాప్... త్వరలోనే వాట్సాప్ డెస్క్ టాప్ అప్లికేషన్!
స్మార్ట్ ఫోన్ ఆధారంగా పనిచేసే వాట్సాప్ త్వరలో కంప్యూటర్ ఉన్న ప్రతీ ఇంటినీ చేరనుంది. ఇప్పటి వరకు వాట్సాప్ మొబైల్ ఫోన్ కే పరిమితం. కంప్యూటర్ లో వెబ్ వాట్సాప్ పేజీలో స్కానింగ్ చేసి కనెక్ట్ చేసుకునే సదుపాయం ఉన్నప్పటికీ మొబైల్ కూడా కచ్చితంగా ఉండాల్సిందే. పైగా అందులో ఇంటర్నెట్ ఆన్ చేసి ఉండాలి. ఈ లింక్ తలనొప్పి లేకుండా మొబైల్ తో పనిలేకుండా కంప్యూటర్ పై నేరుగా వాట్సాప్ ను యాక్సెస్ చేసుకునే సౌలభ్యం ఉంటే బావుండును అనుకునే వారి కోరిక త్వరలోనే సాకారం కానుంది. వాట్సాప్ డెస్క్ టాప్ అప్లికేషన్ పై ఇప్పటికే కృషి జరుగుతున్నట్టు సమాచారం. విండోస్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కు సపోర్ట్ చేసే డెస్క్ టాప్ అప్లికేషన్ అభివృద్ధిపై ఆ సంస్థ ఇంజనీర్లు దృష్టి సారించారు. ఇది కార్యరూపం దాలిస్తే ఫైల్స్, ఫొటోస్ ను కంప్యూటర్ నుంచి కూడా నేరుగా వేగంగా పంపుకునే వెసులుబాటు రానుంది.