: అలాంటి పిచ్ పై భువనేశ్వర్ ను ఎదుర్కోవడం చాలా కష్టం: డ్వెన్ బ్రావో
ఐపీఎల్ లో భాగంగా హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ తో ఓటమిపాలైన అనంతరం గుజరాత్ లయన్స్ జట్టు కీలక ఆటగాడు డ్వెన్ బ్రావో మాట్లాడుతూ, ప్రపంచంలోని బౌలర్లలో అత్యుత్తమ స్వింగ్ రాబట్టగల బౌలర్ భువనేశ్వర్ కుమార్ అని ఆకాశానికెత్తాడు. భువనేశ్వర్ లాంటి బౌలర్ ను తేమ కలిగిన పిచ్ పై ఎదుర్కోవడం సవాలేనని అన్నాడు. భువనేశ్వర్ కుమార్ బౌలింగే తమను ఓటమిపాల్జేసిందని బ్రావో ఆవేదన వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ ఆటగాళ్లైన తాము పరిస్థితులకు తగ్గట్టు ఆడాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా, హైదరాబాదులో శుక్రవారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి తడిసిన పిచ్ చిత్తడిగా మారింది. తర్వాత ఎండకు ఆరినప్పటికీ పిచ్ లో తేమ బంతి స్వింగ్ అయ్యేందుకు బాగా ఉపయోగపడింది. దీంతో భువనేశ్వర్ కుమార్ చెలరేగిపోయాడు. కేవలం 28 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడంతో భువనేశ్వర్ కుమార్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.