: ఎట్టకేలకు దీక్ష విరమించిన కన్నయ్య!
తనతో పాటు తోటి విద్యార్థులకు వర్సిటీ జరిమానా విధించడాన్ని నిరసిస్తూ తొమ్మిది రోజులుగా నిరాహార దీక్షను కొనసాగించిన ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడు కన్నయ్యకుమార్ నేడు దీక్షను విరమించాడు. వర్సిటీ ప్రాంగణంలో నిరాహార దీక్ష ప్రారంభించిన 19మంది విద్యార్థుల్లో ఇప్పటి వరకు కన్నయ్య సహా ఐదుగురు విద్యార్థులు తమ నిరశన దీక్షను విరమించారు. మరో 14మంది విద్యార్థులు మాత్రం పదోరోజు తమ దీక్షను కొనసాగిస్తున్నారు. నిరాహార దీక్షను కొనసాగిస్తున్న కన్నయ్య కుమార్ ఆరోగ్యం క్షీణించడంతో మొదట వర్సిటీలోని మెడికల్ హెల్త్ సెంటర్కి తరలించారు. అనంతరం కన్నయ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ ఆయనను ఎయిమ్స్ కు తరలించారు. నిన్న ఎయిమ్స్ నుంచి డిశ్చార్జైన కన్నయ్య ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా నిరశన దీక్ష విరమించినట్లు జేఎన్యూ స్టూడెంట్ యూనియన్ తెలిపింది. మరో వైపు దీక్ష కొనసాగిస్తున్న విద్యార్థులు బరువు తగ్గిపోతున్నారని, వారి ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు పేర్కొన్నారు. దేశద్రోహం కేసులో కన్నయ్య కుమార్ బెయిలుపై విడుదలైన సంగతి తెలిసిందే.