: ఏం తమ్ముళ్లూ.. ఏపీలో చేసినంత రుణమాఫీ దేశంలో ఎక్కడైనా చేశారా..? కడప ముఖాముఖీలో చంద్రబాబు
కడప జిల్లాలో రైతులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు రుణమాఫీ అంశంపై అనవసర విమర్శలు చేస్తున్నాయనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.20వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం టీడీపీనే అని చంద్రబాబు ఉద్ఘాటించారు. ‘ఏం తమ్ముళ్లూ.. ఏపీలో చేసినంత రుణమాఫీ దేశంలో ఎక్కడైనా చేశారా..?’ అని ప్రశ్నించారు. ‘స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశంలో ఇంత భారీ మొత్తంలో రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా..?’ అని మళ్లీ అడిగారు. రాష్ట్ర విభజనతో ఏపీకి చాలా అన్యాయం జరిగిందని, ఇది మామూలు అన్యాయం కాదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆదాయం చాలా తక్కువగా ఉన్నా తన పట్టుదలతో రైతులను ఆదుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ‘వ్యవసాయాధికారులు మీ దగ్గరకు వస్తున్నారా? లేరా..?’ అని చంద్రబాబు రైతులను ప్రశ్నించారు. 'వారు రాకపోతే చెప్పండి, వెంటనే వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తా'నని వ్యాఖ్యానించారు.