: చెడుపై పోరాడుతూ, సందేశాన్నిచ్చే ‘శక్తిమాన్’ బుల్లితెరపై మళ్లీ అలరించనున్నాడు
ఒకప్పుడు ఆదివారం వస్తోందంటే స్కూలుకి సెలవు వస్తోందని మాత్రమే కాదు.. బుల్లితెరలో ‘శక్తిమాన్’ కూడా వస్తాడని పిల్లలు ఎంతగానో సంబరపడిపోయేవారు. చెడుపై పోరాడుతూ, ప్రతీ ఎపిసోడ్‌లోనూ ఓ సందేశాన్ని ఇచ్చే శక్తిమాన్ సీరియల్‌కు అప్పట్లో ప్రేక్షకులు నీరాజనం పట్టారు. 1997లో దూరదర్శన్‌లో ప్రారంభమైన ఈ సీరియల్ ఏకధాటిగా 2005 వరకు కొనసాగి ప్రేక్షకులను అలరించింది. అయితే ఆ శక్తిమాన్ ఇప్పుడు మళ్లీ బుల్లితెరపై కనిపించనున్నాడు. సీరియల్ కొత్త సిరీస్ 'రిటర్న్ ఆఫ్ శక్తిమాన్'ను మళ్లీ ప్రసారం చేయాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సీరియల్లో శక్తిమాన్ పాత్ర పోషించిన ముఖేష్ కన్నానే చెప్పారు. శక్తిమాన్ రిటర్న్స్‌లో నటించడానికి కసరత్తు కూడా మొదలెట్టేసినట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో ‘శక్తిమాన్’ దూరదర్శన్‌లో ప్రసారమైన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు శక్తిమాన్ రిటర్న్స్ మాత్రం ప్రయివేటు ఛానల్లో ప్రసారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని కోసం పలు ఛానళ్లను సంప్రదిస్తున్నట్లు ఖన్నా తెలిపారు.