: హుజూరాబాదు కోర్టులో ‘జబర్దస్త్’ టీం!... గైర్హాజరైన నాగబాబు, రోజా
తనదైన కామెడీ పంచ్ లతో జనాన్ని కడుపుబ్బా నవ్విస్తున్న ఈటీవీ కార్యక్రమం ‘జబర్దస్త్’ వివాదాల్లో చిక్కుకుంటోంది. గతంలో ఓ కులాన్ని కించపరిచేలా స్కిట్ వేశాడన్న ఆరోపణలపై ‘జబర్దస్త్’ హాస్యనటుడు వేణుపై ఓ వర్గం దాడి చేసింది. తాజాగా ‘జబర్దస్త్’ సభ్యులు మొత్తం కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. న్యాయవాద వృత్తిని అగౌరవపరిచేలా ఓ స్కిట్ వేశారన్న కారణంగా ‘జబర్దస్త్’ టీం సభ్యులతో పాటు కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ప్రముఖ టాలీవుడ్ నటులు నాగబాబు, రోజా, నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి, యాంకర్లు రేష్మి, అనసూయ... మొత్తం 22 మందికి కరీంనగర్ జిల్లా హుజూరాబాదు కోర్టు సమన్లు జారీ చేసింది. హుజూరాబాదుకు చెందిన న్యాయవాది అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ మేరకే ‘జబర్దస్త్’ టీంకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు అందుకున్న ‘జబర్దస్త్’ టీంలోని సభ్యుల్లో పచ్చ మధు, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, షేకింగ్ శేషు, నాగేశ్వరరావు, ఫణి నిన్న కోర్టుకు హాజరయ్యారు. కార్యక్రమ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డితో పాటు నాగబాబు, రోజా, రష్మీ, అనసూయ, ఇతర నటులు కోర్టుకు హాజరు కాలేదు. వీరి తరఫున వారి న్యాయవాది హాజరయ్యారు. తదుపరి విచారణను న్యాయమూర్తి జూన్ 30కి వాయిదా వేశారు.