: గాయాలతోనే సర్కారీ కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర... ప్రమాదంపై ఆరా తీసిన చంద్రబాబు


టీడీపీ కీలక నేత, ఏపీ ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మొన్న రాత్రి తిరుపతి నుంచి విజయవాడ వస్తున్న క్రమంలో గుంటూరు జిల్లా పరిధిలో ఆయన కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో రవీంద్రతో పాటు మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన మంత్రి అనుచరులు ఆయనను సమీపంలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేయించుకున్న తర్వాత రవీంద్ర విజయవాడ వచ్చేశారు. ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడినప్పటికీ, ఆ షాక్ నుంచి త్వరగా కోలుకోవడం అంత ఈజీ కాదు. కానీ కొల్లు రవీంద్ర మాత్రం ఆ దుర్ఘటన నుంచి క్షణాల్లో తేరుకున్నారు. నిన్న విజయవాడలో జరిగిన నీరు-చెట్టు కార్యక్రమానికి సీఎం చంద్రబాబునాయుడితో కలిసి హాజరయ్యారు. రవీంద్ర గాయపడ్డారన్న సమాచారంతో ఆయన కనిపించగానే చంద్రబాబు పలకరించారు. ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. దీంతో ప్రమాదాన్ని చంద్రబాబుకు వివరించిన రవీంద్ర... తనకైన గాయాలు స్వల్పమైనవేనని చెప్పడమే కాకుండా వాటిని చంద్రబాబుకు చూపించారు. ఈ సందర్భంగా మిగిలిన మంత్రులు, టీడీపీ నేతలు కూడా రవీంద్రను పరామర్శించారు.

  • Loading...

More Telugu News