: ఆ డిగ్రీ ప్రధాని మోదీది కాదు: ఆప్ నేతల తాజా బాంబు
ప్రధాని నరేంద్రమోదీ విద్యార్హతల విషయంలో ఆమ్ ఆద్మీ మరోసారి విమర్శలు, ఆరోపణలకు దిగింది. ప్రధాని మోదీకి ఢిల్లీ యూనివర్సిటీ అసలు ఎలాంటి డిగ్రీని ఇంతవరకు ప్రదానం చేయలేదని ఆ పార్టీ నేత ఆశిష్ ఖేతాన్ వివరాలు బయటపెట్టారు. 1975 నుంచి 1980 వరకు ఢిల్లీ యూనివర్సిటీ రికార్డులను తాము అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా పరిశీలించామని, నరేంద్ర దామోదర్ దాస్ పేరుతో ఏ వ్యక్తికీ డిగ్రీ ప్రదానం చేయలేదని చెప్పారు. అయితే, 1975 నుంచి 1978 వరకు నరేంద్ర కుమార్ మహావీర్ ప్రసాద్ మోదీ అనే రాజస్థాన్ లోని ఆళ్వార్ కు చెందిన వ్యక్తి డిగ్రీ చేసినట్టుగా ఉందన్నారు. అతడి పుట్టిన తేదీ 1958 అక్టోబర్ 19గా ఉందని వివరించారు. పత్రికల్లో ప్రధాని మోదీ డిగ్రీ విషయమై వచ్చిన సమాచారం ఢిల్లీ యూనివర్సిటీ రికార్డుల ప్రకారం సరైనది కాదన్నారు. తమ పరిశోధనలో ఆ డిగ్రీ నకిలీదని తేలిందని, ఇది చాలా తీవ్రమైన నేరమన్నారు. వర్సిటీ రికార్డులను తారుమారు చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.