: ప్రభుత్వ కళాశాలలకు 'నీట్' నుంచి ఊరట ...విచారణ సోమవారానికి వాయిదా
వైద్య కళాశాలలలో ప్రవేశాలకు సంబంధించిన 'నీట్' పరీక్షపై ఈ రోజు కూడా సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పరీక్షలు నిర్వహించుకోవచ్చని ఎంసీఐ చేసిన వాదనతో సుప్రీం ఏకీభవించింది. అంతేకాకుండా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తమ కళాశాలలకు ఈ ఏడాది ప్రవేశ పరీక్ష నిర్వహించుకోవచ్చని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. దీంతో ప్రభుత్వ కళాశాలలకు ఊరట లభించింది. అయితే, ప్రైవేటు నిర్వహణలో వున్న వైద్య కళాశాలలలో మాత్రం ప్రవేశాలు 'నీట్' ద్వారానే జరగాలని సుప్రీం తేల్చిచెప్పింది. ఇక తొలివిడత 'నీట్' రాయని వారు రెండో విడత రాసుకోవచ్చని, అయితే, తొలివిడత రాసిన వారు మాత్రం మరోసారి రాయడానికి వీల్లేదని, ఈ పరీక్షను నిర్వహిస్తున్న సీబీఎస్ఈ వాదించింది. 'నీట్' పరీక్షపై వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి, వాటిపై శని, ఆదివారాలు చర్చించి సోమవారం కోర్టు దృష్టికి తీసుకువస్తామని కేంద్రం తరఫున సొలిసిటరీ జనరల్ తెలిపారు. దీంతో కేసు విచారణను సుప్రీం ఈ నెల 9 (సోమవారం)కి వాయిదా వేసింది.